LOADING...
US-Iran: అమెరికా-ఇరాన్ డీల్‌కు బ్రేక్?.. బీరుట్‌పై దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు!
అమెరికా-ఇరాన్ డీల్‌కు బ్రేక్?.. బీరుట్‌పై దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు!

US-Iran: అమెరికా-ఇరాన్ డీల్‌కు బ్రేక్?.. బీరుట్‌పై దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య కుదరబోతున్నట్లు ప్రకటించిన శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయని ప్రకటించినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇదే సమయంలో లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులు పరిస్థితిని మళ్లీ సంక్లిష్టంగా మార్చాయి. ఆదివారం ట్రంప్ అధికారిక షెడ్యూల్‌లో శాంతి ఒప్పందానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమం లేకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయన ప్రకటించిన ఒప్పందం నిజంగా పూర్తయిందా? లేక ఇంకా చర్చల దశలోనే ఉన్న ప్రక్రియను పూర్తిస్థాయి ఒప్పందంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు

తన

ఇదిలా ఉండగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ పరిస్థితుల్లో ప్రతిపాదిత శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ అమెరికాకు స్పష్టం చేశారు. దీంతో ఇజ్రాయెల్ చర్యలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే దశలో ఉన్నామని, సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని ఆయన సూచించినట్లు సమాచారం.

వివరాలు

హెజ్బొల్లాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. హెజ్బొల్లా స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం కూడా దాడులు కొనసాగించింది. హెజ్బొల్లా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా బీరుట్‌పై బాంబు దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో కనీసం ముగ్గురు పౌరులు మరణించినట్లు లెబనాన్ అధికారులు తెలిపారు.

Advertisement

వివరాలు

'హామీలను నెరవేర్చే సంకల్పం ఎక్కడ?'

బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి ఒప్పందాన్ని అమలు చేసే సామర్థ్యం, సంకల్పం అమెరికాకు లేకపోతే చర్చలను కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. ఆదివారం 'ఎక్స్' వేదికగా స్పందించిన ఆయన, "ఇజ్రాయెల్ దురాక్రమణను అడ్డుకోలేకపోవడం ద్వారా తమ హామీలను నెరవేర్చే సంకల్పం అమెరికాకు లేదని మరోసారి రుజువైంది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతే శాంతి చర్చలకు అర్థం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు సాగడం గురించి మాట్లాడుకోవడంలో ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు

అరాగ్చీ రాజీనామా డిమాండ్

మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి రాజీనామా చేయాలని దేశంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో శాంతి ఒప్పందం విషయంలో దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ ఒప్పందం అమలైతే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి‌పై ఇరాన్ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంటున్నారు. యూఎస్-ఇరాన్ ఒప్పందం ఆదివారం నాటికి పూర్తవుతుందని, ఎలక్ట్రానిక్ సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ట్రంప్‌తో పాటు పాకిస్థాన్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది. దీంతో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం భవితవ్యంపై మళ్లీ సందిగ్ధత నెలకొంది.

Advertisement