LOADING...
Pakistan: పాకిస్థాన్‌లో ఐఈడీ పేలుళ్లు.. ఏడుగురు మృతి.. తాలిబన్లపై అనుమానాలు
పాకిస్థాన్‌లో ఐఈడీ పేలుళ్లు.. ఏడుగురు మృతి.. తాలిబన్లపై అనుమానాలు

Pakistan: పాకిస్థాన్‌లో ఐఈడీ పేలుళ్లు.. ఏడుగురు మృతి.. తాలిబన్లపై అనుమానాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. దేశంలోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో కనీసం ఏడుగురు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు అప్రమత్తమై విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మొదటి పేలుడు రోడ్డుపై వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకోగా, మరో బాంబు పేలింది. ఈ రెండో పేలుడులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

వివరాలు 

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబొం: ఆసిఫ్ అలీ జర్దారీ

ఈ దాడులకు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించలేదు. అయితే గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన పాకిస్థాన్ తాలిబన్ సంస్థ తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) పాత్ర ఉండొచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. దుండగులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక సహాయం, ఇతర మద్దతు అందిస్తున్న దేశీయ, విదేశీ శక్తులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

వివరాలు 

బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోజరిగిన పేలుడులో కనీసం 24 మంది మృతి

గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా టీటీపీ తరచూ భద్రతా బలగాలు, ప్రభుత్వ లక్ష్యాలపై దాడులు చేస్తోంది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీపీ కార్యకలాపాలు మరింత పెరిగాయని పాకిస్థాన్ అధికారులు చెబుతున్నారు. టీటీపీకి చెందిన పలువురు నేతలు, మిలిటెంట్లు అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కూడా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సైనిక సిబ్బందితో ప్రయాణిస్తున్న రైలులో జరిగిన పేలుడులో కనీసం 24 మంది మృతిచెందగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ఆ దాడికి నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) బాధ్యత వహిస్తూ, దానిని ఆత్మాహుతి దాడిగా ప్రకటించింది. తాజా పేలుళ్లతో పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement