
India - Pakistan:ఐరాసలో షరీఫ్ సింధూ జలాల ప్రస్తావన.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి వేదికగా స్పందించారు. భారత్ తీసుకున్న ఈ చర్యను ఆయన 'యుద్ధ ప్రకటన'గా అభివర్ణించారు. దీనిపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలను ప్రచారం చేస్తోందని తిప్పికొట్టింది. ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయడం చట్టవిరుద్ధమని విమర్శించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, సింధూ జలాలపై పాకిస్థాన్ ప్రజలకు విడదీయరాని హక్కు ఉందని పేర్కొన్నారు.
Details
సింధూ జలాల ఒప్పందం విషయంలో పాక్ ఆరోపణలు అబద్ధమే
ఆ హక్కును కాపాడేందుకు పాక్ వెనక్కి తగ్గదని స్పష్టం చేస్తూ, ఒప్పందం ఉల్లంఘన యుద్ధ చర్యతో సమానమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ గట్టిగా ప్రతిస్పందించారు. పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా, నాటకీయంగా ఉన్నాయని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాక్ విదేశాంగ విధానంలోని కీలక అంశమని గుర్తుచేశారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆ దేశానికి ఎలాంటి సిగ్గు లేదని, కానీ వాస్తవాలను దాచలేరని గహ్లోత్ స్పష్టం చేశారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నట్లు నటించిన పాక్ వాస్తవానికి దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించిందని గుర్తు చేశారు. ద్వంద్వ ప్రమాణాలను కొనసాగించడం పాక్‌కి కొత్త విషయం కాదని గహ్లోత్ ఎత్తిచూపారు.