LOADING...
Trump vs Harvard: ట్రంప్‌ యాక్షన్‌.. కోర్టును ఆశ్రయించిన హార్వర్డ్‌ యూనివర్సిటీ
ట్రంప్‌ యాక్షన్‌.. కోర్టును ఆశ్రయించిన హార్వర్డ్‌ యూనివర్సిటీ

Trump vs Harvard: ట్రంప్‌ యాక్షన్‌.. కోర్టును ఆశ్రయించిన హార్వర్డ్‌ యూనివర్సిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు హార్వర్డ్‌ యూనివర్సిటీ ధీటుగా స్పందిస్తోంది. గతంలో ట్రంప్‌ ప్రభుత్వం హార్వర్డ్‌కు లభించే ఫెడరల్‌ నిధులకు కోత విధించగా,తాజాగా మరోసారి ఆర్థిక పరంగా దెబ్బకొట్టేందుకు కత్తెర సిద్ధం చేయడంతో,యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించడం గమనార్హం. హార్వర్డ్‌ యూనివర్సిటీ మసాచుసెట్స్‌ కోర్టులో ఫెడరల్‌ నిధులను నిలిపివేయడాన్నివ్యతిరేకిస్తూ కేసు దాఖలు చేసింది. ట్రంప్‌ ప్రభుత్వం విద్యాసంస్థలపై నియంత్రణ పెంచేందుకు ఈవిధానాన్ని అవలంబిస్తోందని పేర్కొంది. దీని ద్వారా నైపుణ్యాలకు,స్వతంత్ర నిర్ణయాలకు ఆటంకం కలుగుతోందని హార్వర్డ్‌ వాదిస్తోంది. ఫెడరల్‌ చట్టాలను,నిబంధనలను ఉల్లంఘించేలా ట్రంప్‌ చర్యలున్నాయని కేసులో పేర్కొంటూ, నిధుల నిలిపివేతను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోర్టును కోరింది. అదే విధంగా యూనివర్సిటీకి తగిన ఖర్చులను చెల్లించేలా ట్రంప్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది.

వివరాలు 

యూదులపై వ్యతిరేకతను అడ్డుకునే చర్యల గురించి వైట్‌హౌస్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ

ఇందుకు పునాదిగా,ట్రంప్‌ సర్కార్‌ హార్వర్డ్‌కు విధించిన కొన్ని నియంత్రణలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీ క్యాంపసుల్లో యూదులపై వ్యతిరేకతను అడ్డుకునే చర్యల గురించి వైట్‌హౌస్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ వాటిని హార్వర్డ్‌ అధ్యక్షుడు అలాన్‌ గార్బర్‌ తూర్పారబడుతూ,విద్యాసంస్థల స్వేచ్ఛను కాపాడే ధోరణి ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలతోనే వివాదానికి నాంది పలికింది.ఇప్పటికే ట్రంప్‌ ప్రభుత్వం హార్వర్డ్‌ యూనివర్సిటీకి మంజూరైన 2.2 బిలియన్‌ డాలర్ల ఫెడరల్‌ నిధులకు కోత పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 1 బిలియన్‌ డాలర్ల నిధులపై కోత విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. వైద్య పరిశోధనల కోసం మంజూరయ్యే గ్రాంట్లు,ఒప్పందాలపై ఈ కోత ప్రభావం చూపనుంది. దీనికి సంబంధించిన సమాచారం వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనంగా ప్రచురించింది.

వివరాలు 

విదేశీ విద్యార్థుల అంశంలో కూడా ట్రంప్‌ ప్రభుత్వం కఠినం

దీనిపై హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యక్షుడు గార్బర్‌ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ డిమాండ్లను అంగీకరించబోమని, బహిరంగంగా తిరస్కరిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనలతో ట్రంప్‌ యంత్రాంగం మరింత గట్టి దాడికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గార్బర్‌ వ్యవహారశైలిపై ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. ఇక, విదేశీ విద్యార్థుల అంశంలో కూడా ట్రంప్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులను సమర్పించకపోతే, కొత్తగా విదేశీయులను చేర్చుకునే అనుమతులు ఇవ్వబోమని హెచ్చరించింది. హోంలాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్‌ విశ్వవిద్యాలయానికి లేఖ రాసి, ఈ నెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని కోరారు. లేకపోతే ఎస్‌ఈవీపీ (SEVP) ధ్రువీకరణను రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు 

9బిలియన్‌ డాలర్ల ఫెడరల్‌ నిధులను కోల్పోయే అవకాశం 

హార్వర్డ్‌ యూనివర్సిటీ మాత్రం ఈ బెదిరింపులను పెద్దగా పట్టించుకోకుండా,తమ మునుపటి వైఖరికి కట్టుబడి ఉంటామంటూ స్పష్టం చేసింది. "ఆ లేఖ మాకు వచ్చింది. కానీ మేము మా రాజ్యాంగ హక్కులు, స్వాతంత్య్రాన్నితాకట్టు పెట్టం.మేము చట్టబద్ధంగా నడుచుకుంటాం.ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలి"అని యూనివర్సిటీ ప్రతినిధి వివరించారు. ఈవ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలని ట్రంప్‌ ప్రభుత్వం కోరినా,హార్వర్డ్‌ తీసుకున్న తెరమరుగైన చర్యలే ఇప్పుడు వైట్‌హౌస్‌ మరింత దూకుడుగా వ్యవహరించేందుకు దారితీశాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ట్రంప్‌ ప్రభుత్వంతో ఈ విధంగా విభేదాలు తలెత్తడం వల్ల హార్వర్డ్‌ యూనివర్సిటీ దాదాపు 9బిలియన్‌ డాలర్ల ఫెడరల్‌ నిధులను కోల్పోయే అవకాశముందని అంచనా. అయితే ఈ వివాదం కోర్టుకు చేరడంతో, ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.