Sheikh Hasina: మానవ హక్కుల ఉల్లంఘన.. నేను దేనికీ భయపడను : కోర్టు తీర్పు వేళ యూనస్ ప్రభుత్వంపై హసీనా సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
గత ఏడాది బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న హింసాకాండ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా అమానుష చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ఈ రోజు తీర్పు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హసీనా తాజాగా స్పందిస్తూ, తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా కల్పితాలేనని ఖండించారు. తన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు వినిపిస్తున్న ఆరోపణలను ఆమె స్పష్టంగా తిరస్కరించారు. "నేను పది లక్షల రోహింగ్యా శరణార్థులకు నా దేశంలో ఆశ్రయం కల్పించాను. ఇలాంటి నేను ఎలా మానవ హక్కులను ఉల్లంఘించానని చెబుతున్నారు?" అంటూ ప్రశ్నించారు.
వివారాలు
యూనస్ ప్రభుత్వం కుట్ర
తీర్పు వెలువడే ముందు తన అనుచరులతో మాట్లాడిన హసీనా, యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వంపై కఠిన విమర్శలు చేశారు. అవామీ లీగ్‌ను పూర్తిగా చిత్తు చేయాలని యూనస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. "మా పార్టీని అంత సులువుగా చెరిపేయలేరు. అవామీ లీగ్ అధికార దుర్వినియోగం చేసే వారి చేత అందించబడిన పార్టీ కాదు. ఇది సాధారణ ప్రజల నుండి ఎదిగిన ఉద్యమం" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
నేరగాళ్లు హీరోలు అవుతున్నారు
తాను అధికారంలో ఉన్న సమయంలో దోపిడీలు, నేరాలను అరికట్టడానికి కఠిన చట్టాలు అమలు చేసినట్లు హసీనా గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ హయాంలో నేరస్థులు హీరోలుగా మారిపోయారని, తనపై కుతంత్రాలు నడిపి తప్పుడు కేసులు బనాయించినట్లు ఆమె వేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రల కారణంగా తాను స్వదేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తన మద్దతుదారులకు సూచించారు.
వివరాలు
నేను దేనికీ భయపడను
"మా కార్యకర్తలు ఒక్కరూ కూడా భయపడకండి. నేను బ్రతికే ఉన్నాను, ఇంకా బ్రతికే ఉంటాను. మళ్లీ ప్రజల కోసం పనిచేయడానికి తిరిగి వస్తాను. బంగ్లాదేశ్ నేలపై న్యాయం సాధిస్తాను" అని దృఢంగా తెలిపారు. "తీర్పు ఏమొస్తుందో రానివ్వండి. దాని గురించి నాకు ఏమాత్రం భయం లేదు. అలాంటి తీర్పులు నాకు పట్టవు. అల్లా నాకు జీవితం ఇచ్చాడు; తీసుకోవడమూ ఆయన చేతిలోనే ఉంటుంది. కానీ నా దేశ ప్రజల కోసం పని చేయడాన్ని ఎవ్వరూ ఆపలేరు. నేను నా తల్లిదండ్రులను, నా సోదరులను కోల్పోయాను. నా ఇల్లు కాల్చేశారు. అయినా నా ధైర్యం తగ్గలేదు" అని హసీనా భావోద్వేగంతో చెప్పారు.
వివరాలు
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్
తనపై ప్రతికూల తీర్పు వస్తే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయాలని కూడా ఆమె కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రభుత్వ నేత యూనస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన అవినీతిపరుడు మాత్రమే కాకుండా, ఉగ్రవాది, హంతకుడని కూడా ఆమె ఆరోపించారు. యూనస్ దేశ అధికారాన్ని అక్రమంగా చేజిక్కించుకున్నాడని, హంతకులకు క్షమాభిక్షలు ఇచ్చిందీ ఇతడేనని హసీనా అన్నారు.