Bangladesh polls: బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా.. రికార్డు స్థాయిలో ఐదోసారి విజయం
మిత్రపక్షాల బహిష్కరణ, ఘర్షణ వాతావరణం మధ్య జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికలలో షేక్ హసీనా(76)కి చెందిన అవామీ లీగ్ పార్టీ మూడింట రెండు వంతుల సీట్లను గెలుచుకోవడంతో వరుసగా నాలుగోసారి, మొత్తంగా అయిదోసారి అధికారం చేపట్టడం ఖరారైంది. మొత్తం 300 సీట్లున్న పార్లమెంట్‌లో 299 స్థానాలకు పోటీ జరగగా హసీనా పార్టీ అవామీ లీగ్ 200 సీట్లను గెలుచుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్‌లో అవామీ లీగ్ గెలిచినట్లు పార్టీ ఎన్నికల అధికారులు తెలిపారు.
అత్యల్పంగా 40 శాతం ఓటింగ్
హసీనా 1986 నుండి ఎనిమిదోసారి గోపాల్‌గంజ్-3 సీటును గెలుచుకున్నారు. ఆమె 249,965 ఓట్లను సాధించగా, బంగ్లాదేశ్ సుప్రీం పార్టీ నుండి ఆమె సమీప ప్రత్యర్థి ఎం నిజాం ఉద్దీన్ లష్కర్ కేవలం 469 ఓట్లను సాధించారు. జాతీయ పార్టీ ఛైర్మన్ GM క్వాడర్ 12వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికల్లో రంగ్‌పూర్-3 సీటును గెలుచుకున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 40 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే తుది లెక్కింపు తర్వాత ఈ సంఖ్య మారవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్ కాజీ హబీబుల్ అవల్ తెలిపారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.