LOADING...
Sheikh Hasina: అభివృద్ధి శిల్పి నుండి మరణశిక్ష వరకు: షేక్‌ హసీనా ప్రస్థానం
అభివృద్ధి శిల్పి నుండి మరణశిక్ష వరకు: షేక్‌ హసీనా ప్రస్థానం

Sheikh Hasina: అభివృద్ధి శిల్పి నుండి మరణశిక్ష వరకు: షేక్‌ హసీనా ప్రస్థానం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తన మద్దతుదారుల దృష్టిలో ఆమె.. ఆధునిక, అభివృద్ధి దిశగా ఉరుకులు వేసే బంగ్లాదేశ్ శిల్పి. విమర్శకులకు మాత్రం.. అధికార దాహంతో ఉన్న నిరంకుశ నాయకురాలు. ఆమే మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా (Sheikh Hasina). దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయాలపై ఏకపక్ష ప్రభావం చూపిన ఆమెను చాలామంది 'ఉక్కు మహిళ' అని పిలిచేవారు. కానీ, తనే ఏర్పాటుచేసిన ట్రైబ్యునల్... చివరకు తనకే మరణశిక్ష (Sheikh Hasina death sentence) విధించడం విశేషం.

వివరాలు 

విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా.. 

1947 సెప్టెంబర్ 28న అప్పటి తూర్పు పాకిస్థాన్‌లోని తుంగిపారాలో షేక్ హసీనా జన్మించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించిన ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌ 'జాతిపిత'గా చరిత్రలో నిలిచారు. ఢాకా విశ్వవిద్యాలయంలో బెంగాలీ సాహిత్యంలో మాస్టర్స్ పూర్తిచేసేటప్పుడే హసీనా విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో అణు శాస్త్రవేత్త ఎం.ఎ. వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. రాజకీయాలకు దూరంగా, వినయంతో జీవించిన ఆయన 2009లో మరణించే వరకు హసీనాకు తోడుగా నిలిచారు. వారికి సజీబ్ వాజెద్ జాయ్ అనే కుమారుడు, సైమా వాజెద్ పుతుల్ అనే కుమార్తె ఉన్నారు.

వివరాలు 

కుటుంబ సభ్యులంతా హత్య 

1975 ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు హసీనా జీవితాన్ని పూర్తిగా తారుమారుచేసింది. ఆ ఉద్రిక్తతల్లో ఆమె తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు సహా కుటుంబంలోని చాలా మంది హత్యకు గురయ్యారు. ఆ సమయంలో హసీనా, ఆమె చెల్లెలు రెహానా విదేశాల్లో ఉండటంతో ప్రాణాలు నిలిచాయి. అనంతరం భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆశ్రయం ఇచ్చారు. ఆరు సంవత్సరాల తర్వాత, 1981 మేలో హసీనా తిరిగి బంగ్లాదేశ్ చేరుకున్నారు. ఆశ్చర్యకరంగా, ఆమె రాకకముందే అవామీ లీగ్ పార్టీ ఏకగ్రీవంగా ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసింది.

వివరాలు 

తిరుగులేని నాయకురాలిగా 

హసీనా తిరిగి రావడం అంటే ఆమె ప్రధాన ప్రత్యర్థి ఖలీదా జియాకే సవాలు. హత్యకు గురైన అధ్యక్షుడు జియౌర్ రెహమాన్ భార్య అయిన ఖలీదాతో హసీనా మధ్య మూడు దశాబ్దాలపాటు కొనసాగిన తీవ్ర రాజకీయ పోటీకి ప్రపంచం 'Battling Begums' అనే పేరు పెట్టింది. 1996లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హసీనా, 2001లో అధికారాన్ని కోల్పోయారు. అయితే, 2008లో భారీ విజయంతో తిరిగి సత్తా చాటారు. తరువాత 2014, 2018 ఎన్నికల్లోనూ అవామీ లీగ్ వరుస విజయాలు సాధించడంతో ఆమె ప్రపంచంలోనే అత్యధిక కాలం దేశాన్ని నడిపిన మహిళా నాయకుల్లో ఒకరిగా నిలిచారు.

వివరాలు 

అభివృద్ధి.. ఆరోపణలు 

ఆమె పాలనలో బంగ్లాదేశ్ ఆర్థిక రంగం వేగవంతమైన ఎదుగుదల సాధించింది. పద్మా వంతెన వంటి భారీ మౌలిక సదుపాయాల పనులు పూర్తయ్యాయి. పేదరికం తగ్గింది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా మారింది. అయితే మరోవైపు హసీనా ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. విభిన్న అభిప్రాయాలను అణగదొక్కడం మీడియా స్వేచ్ఛపై నియంత్రణలు ప్రతిపక్ష నేతల అరెస్టులు భద్రతా బలగాలకు అధిక అధికారాలు ఇవ్వడం అంటూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.

వివరాలు 

విద్యార్థి ఉద్యమాలే తిరుగుబాటుకు దారితీశాయి

2024లో స్వాతంత్ర్య సమరయోధుల సంతతికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు భారీ నిరసనలు మొదలుపెట్టారు. క్రమంగా అవి దేశవ్యాప్తంగా భారీ తిరుగుబాటుగా మారాయి. ప్రభుత్వ భద్రతా చర్యలు హింసను మరింత పెంచాయి. ఈ అల్లర్లు జూలై తిరుగుబాటుగా పేరుపొందగా, ఇందులో 1,400 మందికి పైగా మరణించారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ పేర్కొంది. చివరకు హసీనా రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.

వివరాలు 

తీవ్ర ఆరోపణలు.. మరణ శిక్ష 

అంతకంతకూ ఉద్రిక్తతలు పెరుగుతుండగా మహ్మద్ యూనస్‌ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం 'అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ICT)'ను మళ్లీ క్రియాశీలం చేసింది. ఇదే ట్రైబ్యునల్‌ను యుద్ధ నేరాల విచారణ కోసం మొదట ఏర్పాటు చేసినది హసీనే. కానీ 2024 అల్లర్ల నేపధ్యంలో అదే ట్రైబ్యునల్ ఆమెపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేశారన్న తీవ్రమైన ఆరోపణలు మోపింది. నెలల తరబడి విచారణల తర్వాత సోమవారం ఆమెకు మరణశిక్ష (Sheikh Hasina death sentence) విధించింది.

వివరాలు 

బంగ్లా భవిష్యత్తుపై మథనం 

తన ఎదుగుదలకు తోడ్పడిన దేశమే తన పతనానికి తీర్పు పలకడం హసీనాను తీవ్రంగా కలిచివేసింది. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందిన ఆమె, సరిహద్దు ఆవల జరుగుతున్న పరిణామాలపై మథనపడుతున్నారు. తనకు విధించిన మరణ శిక్షను ఖండించారు. తీర్పు మోసపూరితమన్నారు. తన శిక్ష రాజకీయ కుతంత్రాల ఫలితమని కోర్టు తనకు సరిగా వాదించుకునే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.