LOADING...
F-1 visa holders: అమెరికా షాక్.. విద్యార్థి వీసాలకు ఇక 4 ఏళ్లే గడువు!
అమెరికా షాక్.. విద్యార్థి వీసాలకు ఇక 4 ఏళ్లే గడువు!

F-1 visa holders: అమెరికా షాక్.. విద్యార్థి వీసాలకు ఇక 4 ఏళ్లే గడువు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థుల బస కాలానికి పరిమితులు విధించే కొత్త నిబంధన అమలుకు శ్వేతసౌధం కసరత్తు పూర్తి చేసింది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (OMB) ఆమోదం తెలిపింది. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. హోంలాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధన ప్రకారం, ఎఫ్-1 విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులు గరిష్టంగా నాలుగేళ్ల పాటు మాత్రమే అక్కడ ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ గడువు అనంతరం కూడా తమ కోర్సును కొనసాగించాల్సి వస్తే, డీహెచ్‌ఎస్‌ వద్ద వీసా గడువు పునరుద్ధరణ (రెన్యువల్) కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు

కోర్సు పూర్తయ్యేంత వరకు అమెరికాలో ఉండొచ్చు

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం, విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకు అమెరికాలో ఉండవచ్చు. ఒకవేళ కోర్సు పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమైతే, సంబంధిత విద్యాసంస్థకు చెందిన డిజిగ్నేటెడ్ స్కూల్ అధికారి (DSO) ద్వారా ఏడాది చొప్పున వీసా గడువును పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే కొత్త నిబంధన అమల్లోకి వస్తే ఈ విధానానికి ముగింపు పలికినట్లవుతుంది. విద్యార్థులు నిర్దిష్ట కాలపరిమితి ముగిసిన తర్వాత తప్పనిసరిగా రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన కేవలం ఎఫ్-1 విద్యార్థి వీసాలకు మాత్రమే కాకుండా, జే (J) మరియు ఐ (I) వీసాలపై అమెరికాను సందర్శించే వారి బస కాలానికి కూడా పరిమితులు విధించనుందని సమాచారం.

Advertisement