USA: యుద్ధంలో అమెరికాకు షాక్.. అవాక్స్ నిఘా విమానం కూల్చివేత
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధరంగంలో కీలక పాత్ర పోషించే నిఘా విమానం ఈ3-సెంట్రీ (AWACS)ను ఇరాన్ దళాలు ధ్వంసం చేసినట్లు సమాచారం. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. యుద్ధరంగంలో ఈ3-సెంట్రీ సాధారణ విమానం కాదు. బోయింగ్-707 ఆధారంగా ప్రత్యేకంగా మార్పులు చేసి, గగనతల కమాండ్ సెంటర్‌లా దీనిని అభివృద్ధి చేశారు. శత్రు దేశాల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకర్ విమానాల కదలికలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. సుమారు 250 మైళ్ల పరిధిలో గగనతల కార్యకలాపాలను పర్యవేక్షించగలదు.
వివరాలు
అమెరికా యుద్ధ సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం
అమెరికా ఎయిర్ ఫోర్స్ కర్నల్ జాన్ వెనబల్ మాట్లాడుతూ, ఈ ఘటన అమెరికా యుద్ధ సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంపై నిఘా, పరిస్థితుల అంచనాలో సమస్యలు తలెత్తవచ్చని చెప్పారు. అమెరికా గగనతల ఆపరేషన్లకు ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ కీలక కేంద్రంగా ఉంది. ఇరాన్ దిశగా వెళ్లే యుద్ధ విమానాలకు గాల్లో ఇంధనం నింపడం, గూఢచారి సమాచారం సేకరణ, దాడుల సమన్వయం వంటి కార్యకలాపాలు ఇక్కడి నుంచే నిర్వహించబడుతున్నాయి. వీటిలో ఈ3-సెంట్రీ విమానం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.
వివరాలు
ఇప్పటివరకు 303 మంది అమెరికా సైనికులకు గాయాలు
ఇరాన్ దాడులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, అమెరికా ఇప్పటికే 3,500 మంది మెరైన్లను పశ్చిమాసియాకు తరలించింది. అంతేకాకుండా, యూఎస్‌ఎస్ ట్రిపోలీ నౌక సెంట్రల్ కమాండ్ పరిధిలోకి చేరింది. ఈ పరిణామాల మధ్య, భూతల ఆపరేషన్లను అమెరికా ఎలా ప్రారంభించబోతోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 303 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. వీరిలో 273 మంది కోలుకుని తిరిగి విధుల్లో చేరినట్లు తెలిపింది.