Page Loader
Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి
సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి

Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్, గాజా పై విధ్వంసాత్మక దాడులను కొనసాగిస్తోంది. తాజాగా దక్షిణ గాజాలోని రఫాలోని ఓ సహాయక పంపిణీ కేంద్రం సమీపంలో జరిగిన కాల్పుల్లో 30 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేంద్రం అమెరికా నిధులతో నడుస్తోంది. ఆదివారం ఉదయం వేలాది మంది ఆకలితో ఉన్న ప్రజలు సహాయ కేంద్రం వద్ద చేరిన సమయంలో ఇజ్రాయిల్‌ ట్యాంకులు కాల్పులకు తెగబడ్డాయని స్థానిక పాలస్తీనా జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 115 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారు, మృతదేహాలను గాడిద బండ్లపై తరలించడం చూపరులను కదిలించే దృశ్యంగా మారింది. ఈ ఘటనపై హమాస్ తీవ్రంగా స్పందించింది.

Details

గాజాలో మనవాత సంక్షోభం తీవ్రమవుతోంది

సహాయక కేంద్రాలను 'మానవతా సహాయ కేంద్రాలు కాదు, మృతుల ఉచ్చులు'గా హమాస్ అభివర్ణించింది. ఆకలితో సహాయం కోసం వచ్చిన ప్రజలపై ఇజ్రాయిల్‌ ఉచ్చకోత దాడులు జరిపిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన, అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణపై హమాస్ తన నిర్ణయాన్ని వెల్లడించిన కొన్ని గంటల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం. గతంలో మార్చిలో కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినప్పటి నుంచి ఇజ్రాయిల్‌ దాడులు మళ్లీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఫలితంగా గాజా అంతటా మానవతా సంక్షోభం తీవ్రమవుతోంది.

Details

54,381కి చేరిన మృతుల సంఖ్య

ఇక హమాస్ అక్టోబర్‌ 7, 2023న నిర్వహించిన దాడిలో 1,218 మంది మరణించగా, అందులో అధికంగా పౌరులే ఉన్నారు. అప్పటి దాడిలో 251 మంది బందీలుగా పట్టబడ్డారు. వీరిలో 57 మంది ఇంకా గాజాలోనే ఉన్నారు. వీరిలో 34 మంది మరణించారని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. మార్చి 18 నుంచి మళ్లీ ప్రారంభించిన దాడుల్లో ఇప్పటివరకు 4,117 మంది మరణించారని, మొత్తం మృతుల సంఖ్య 54,381కి చేరుకుందని గాజాలోని హమాస్‌ నియంత్రణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో అధికంగా పౌరులే ఉన్నారని పేర్కొంది.