US Tariffs: భారత్‌పై 25శాతం సుంకాల తగ్గింపునకు సంకేతాలు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు (US tariffs) సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సూచనప్రాయ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదనంగా 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా (USA)కు భారత ఎగుమతులపై మొత్తం 50 శాతం సుంకాలు అమలులో ఉన్నాయి. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్కాట్ బెసెంట్.. 'రష్యా చమురు (Russian oil) కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు విధించాం.
Details
సుంకాల ఉపసంహరణపై పరోక్షంగా సంకేతాలు
అయితే ఆ తర్వాత భారత్ రష్యా చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. ఒక భారీ విజయం. ఇప్పటికీ టారిఫ్‌లు అమల్లోనే ఉన్నప్పటికీ, వాటిని తొలగించేందుకు ఒక మార్గం ఉందని నేను భావిస్తున్నాను" అంటూ సుంకాల ఉపసంహరణపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు భిన్నంగా ఉండటం గమనార్హం. భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇప్పటివరకు కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.
Details
వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశం
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే ప్రధాన కారణమని లుట్నిక్ వ్యాఖ్యానించారు. తాజాగా స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే, కొన్ని రోజుల వ్యవధిలోనే అమెరికా ప్రభుత్వంలోని ఇద్దరు కీలక మంత్రులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం రాజకీయ, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి పెరుగుతోంది.