Singapore: విహారయాత్రకు వెళ్లిన భారతీయ మహిళ క్రూయిజ్ షిప్‌లో అదృశ్యం; ఇంతకీ ఏమైంది?
మలేషియాలోని ఉత్తర ద్వీప రాష్ట్రమైన పెనాంగ్ నుంచి సింగపూర్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న క్రూయిజ్ షిప్‌లో 64 సంవత్సరాల వయస్సున్న భారతీయ మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. రీటా సహానీ, ఆమె భర్త జాకేష్ సహానీలు సోమవారం స్పెక్ట్రమ్ ఆఫ్ సీస్‌లో పెనాంగ్ నుంచి సింగపూర్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రూయిజ్ ట్రిప్‌లో భాగంగా చివరిరోజు రీటా సహానీ కనిపంచలేదు. 70 సంవత్సరాల వయస్సున్న జాకేష్, సోమవారం నిద్ర లేవగానే తన భార్య గదిలో లేని విషయాన్నిగుర్తించారు.
సముద్రంలోకి దూకిందా?
భారీ క్రూయిజ్ షిప్‌లో భార్య కోసం జాకేష్ వెతాకారు. కానీ రీటా సహానీ ఎక్కడా కనిపంచలేదు. ఆ తర్వాత జాకేష్ ఈ విషయాన్నిషిప్ సిబ్బందికి తెలియజేశారు. అయితే ఓవర్‌బోర్డ్ డిటెక్షన్ సిస్టమ్స్ యాక్టివేట్ చేసినట్లు, ఓడ నుంచి సింగపూర్ జలసంధిలో ఏదో పడిపోయిందని షిప్ సిబ్బంది చెప్పారు. బహుషా రీటానే దూకేసి ఉండొచ్చని సిబ్బంది అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం, రీటా షిప్‌లోనే ఉండవచ్చని, ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటుందని భావిస్తున్నారు. సింగపూర్ జలసంధి అనేది 113కిలోమీటర్ల పొడవు, 19కిలోమీటర్ల వెడల్పుతో మలక్కా జలసంధిని, దక్షిణ చైనా సముద్రాన్ని కలుపుతుంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని రీటా సహానీ కుమారుడు అపూర్వ్ విజ్ఞప్తి చేశాడు.