LOADING...
Recession: ముందుంది భారీ ఆర్థిక ముప్పు.. ప్రపంచ దేశాలకు మాంద్య హెచ్చరిక
ముందుంది భారీ ఆర్థిక ముప్పు.. ప్రపంచ దేశాలకు మాంద్య హెచ్చరిక

Recession: ముందుంది భారీ ఆర్థిక ముప్పు.. ప్రపంచ దేశాలకు మాంద్య హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండున్నర నెలలు గడిచినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హొర్ముజ్‌ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాలు ఇంధన కొరత, ధరల పెరుగుదల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు త్వరగా ముగిసే సూచనలు కనిపించకపోవడంతో భవిష్యత్తులో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన పశ్చిమాసియా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

ఆహార పదార్థాలు, ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం: లారెన్స్‌ వాంగ్

హొర్ముజ్‌ జలసంధి సమస్య త్వరలో పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. దీని ప్రభావంతో కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రభావం సింగపూర్‌పై కూడా తప్పకుండా పడుతుందని స్పష్టం చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో పాటు ఆహార పదార్థాలు, ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశముందని లారెన్స్‌ వాంగ్‌ తెలిపారు. ప్రస్తుతం హొర్ముజ్‌ జలసంధిని తెరిచినా వెంటనే పరిస్థితులు సాధారణ స్థితికి రావడం కష్టమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని, నెలల తరబడి ఆర్థిక ఒత్తిడి కొనసాగవచ్చని అంచనా వేశారు.

వివరాలు 

భారతీయులు ముందుగానే సిద్ధంగా ఉండాలి: ఉదయ్‌ కొటక్

ఇక కొటక్‌ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్‌ కొటక్‌ కూడా ఇదే అంశంపై స్పందించారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని భారతీయులు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు ఉపయోగించని వారికి కూడా నిత్యావసర వస్తువుల ధరల రూపంలో ఈ ప్రభావం తప్పదన్నారు. ముఖ్యంగా వేతనాలు పెరగని కుటుంబాలపై అదనపు భారం పడుతుందని వివరించారు.

Advertisement

వివరాలు 

ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం: అజయ్‌ బంగా

భారత ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ మాట్లాడుతూ.. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కేవలం విదేశాంగ సమస్య మాత్రమే కాదని.. ఇది భారత్‌ చెల్లింపుల సామర్థ్యానికి పెద్ద పరీక్షగా మారవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా కూడా పశ్చిమాసియా పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రపంచ దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చని అభిప్రాయపడ్డారు.

Advertisement