Loading...
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది

PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనను తాను సూపర్ పవర్‌గా భావించుకుంటున్న పాకిస్థాన్ కు దేశంలో మాత్రం పరిస్థితులు రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్.. మరోవైపు బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రాంతాల్లో తిరుగుబాట్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజల్లో ఆగ్రహం మరింత తీవ్రంగా మారింది. పెట్రోలియం లెవీ, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ జమాత్-ఇ-ఇస్లామీ ఇచ్చిన పిలుపుతో శుక్రవారం పాకిస్తాన్ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి, అబోట్టాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు.

వివరాలు

ప్రధాన రహదారులు, హైవేలపై బైఠాయింపు

ప్రధాన రహదారులతో పాటు హైవేలపైనా ఆందోళనకారులు బైఠాయించారు. 'పెట్రోలియం లెవీని వెంటనే వెనక్కి తీసుకోవాలి', 'ఎలాంటి లెవీ లేకుండా రూ.225కే ఇంధనం అందించాలి' అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.

పెరుగుతున్న ఇంధన ధరలు, పన్నుల భారంతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జమాత్-ఇ-ఇస్లామీ అధినేత హఫీజ్ నయీముర్ రెహ్మాన్ ప్రభుత్వ పన్ను విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రభుత్వం పెట్రోలియం లెవీ ద్వారా ఏకంగా రూ.8 ట్రిలియన్ల పాకిస్తానీ రూపాయలను వసూలు చేసిందని ఆయన ఆరోపించారు.

అయితే పెట్రోలియం లెవీని తగ్గించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంగీకరించిందని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది.

వివరాలు

అవసరమైతే నిరసనలను దీర్ఘకాలం కొనసాగిస్తాం

అయితే శుక్రవారం జరిగిన ఆందోళనలు కేవలం 'ట్రైలర్' మాత్రమేనని జమాత్-ఇ-ఇస్లామీ హెచ్చరించింది.

అవసరమైతే నిరసనలను దీర్ఘకాలం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని హఫీజ్ నయీముర్ రెహ్మాన్ స్పష్టం చేశారు.

దీంతో పాకిస్తాన్‌లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇరాన్ యుద్ధం, ఇప్పటికే ఉన్న ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్‌ను ఇంధన ధరల విషయంలో మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.

ఏప్రిల్‌లో దేశంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.459 పాకిస్తానీ రూపాయలకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.157.26కి సమానం. ఇక డీజిల్ ధర రూ.520.35 పాకిస్తానీ రూపాయలకు పెరిగింది.

ADVERTISEMENT

వివరాలు

పెరిగిన నిత్యావసర ధరలు

ఇంధన ధరలు భారీగా పెరగడంతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఇరాన్ యుద్ధం తర్వాత ఇంధన ధరలు అత్యధికంగా పెరిగిన దేశాల్లో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది.

దీంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పాక్ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజాగ్రహం మరో పెద్ద సవాలుగా మారింది.

ADVERTISEMENT