LOADING...
UAE: 15 ఏళ్లు దాటితేనే సోషల్‌ మీడియా అకౌంట్‌.. యూఏఈలో కొత్త రూల్స్‌!
15 ఏళ్లు దాటితేనే సోషల్‌ మీడియా అకౌంట్‌.. యూఏఈలో కొత్త రూల్స్‌!

UAE: 15 ఏళ్లు దాటితేనే సోషల్‌ మీడియా అకౌంట్‌.. యూఏఈలో కొత్త రూల్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలు దేశాలు సోషల్‌ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో అరబ్‌ దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కూడా చేరింది. సోషల్‌ మీడియా వేదికల వినియోగానికి కనీస వయసును 15 ఏళ్లుగా నిర్ణయిస్తూ యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని గురువారం అధికారికంగా ఆమోదించింది. దీంతో ఈ తరహా నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన తొలి అరబ్‌ దేశంగా యూఏఈ గుర్తింపు పొందింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వ్యక్తిగత ఖాతాలను సృష్టించేందుకు అనుమతి ఉండదు.

వివరాలు

పరిమితులను విధించాలి

అంతేకాకుండా చిన్నారులకు కొన్ని ప్రత్యేక ఫీచర్లకు యాక్సెస్‌ కల్పించకుండా పరిమితులు విధించనున్నారు. వయసుకు అనుగుణం కాని కంటెంట్‌పై నియంత్రణలు, స్క్రీన్‌ టైమ్‌పై పరిమితులు, యాప్‌ల వినియోగ సమయాన్ని నియంత్రించే విధానాలను ఆయా సోషల్‌ మీడియా సంస్థలు అమలు చేయాల్సి ఉంటుంది. సోషల్‌ మీడియా వినియోగం వల్ల పిల్లలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించడం, వారికి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన డిజిటల్‌ వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు

12 నెలల గడువు ఇచ్చిన ప్రభుత్వం

ఈ నిబంధనలకు అనుగుణంగా తమ ప్లాట్‌ఫామ్‌లలో అవసరమైన మార్పులు చేసుకునేందుకు సోషల్‌ మీడియా కంపెనీలకు యూఏఈ ప్రభుత్వం 12 నెలల గడువు ఇచ్చింది. అలాగే ఈ నిబంధనలను దశలవారీగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. 2024 గణాంకాల ప్రకారం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పిల్లలు రోజుకు సగటున మూడు గంటల పాటు సోషల్‌ మీడియాలో గడుపుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. చిన్నారుల సోషల్‌ మీడియా వినియోగాన్ని నియంత్రించే చట్టాన్ని మొదటగా ఆస్ట్రేలియా అమల్లోకి తీసుకురాగా, అనంతరం యూకే, మలేసియా వంటి దేశాలు కూడా ఇదే తరహా నిబంధనలను అమలు చేస్తున్నాయి.

Advertisement