Page Loader
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్టు
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్టు

South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి పెను చిక్కులను తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆయన అభిశంసనకు గురైన విషయం తెలిసిందే. తాజాగా, చట్టాన్ని ఉల్లంఘించి 'మార్షల్ లా' విధించిన కారణంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. బుధవారం తెల్లవారుజామున వందలాది దర్యాప్తు అధికారులు అధ్యక్షుడి నివాసానికి చేరుకున్నారు. తొలుత భద్రతా దళాలు వారికి ఎదురుదాడి చేసాయి.అయినప్పటికీ, కొంతసేపు ప్రతిష్టంభన తరువాత,దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసంలోకి ప్రవేశించి యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత మధ్య ఆయనను అక్కడి నుంచి తరలించారు.గతంలో కూడా ఆయనను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు,కానీ అప్పుడు తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

వివరాలు 

 2024 డిసెంబర్‌లో ఎమర్జెన్సీ మార్షల్ లా 

ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. యూన్ సుక్ యోల్, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, 2024 డిసెంబర్‌లో ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నప్పటికీ, ప్రతిపక్షాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దీనిపై పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టగా, అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పార్లమెంట్ స్పీకర్ మార్షల్ లా చట్టవిరుద్ధమని ప్రకటించారు.

వివరాలు 

అధ్యక్షుని అభిశంసన తీర్మానం

మార్షల్ లా అమలు వల్ల దేశం సంక్షోభంలో పడిందని, అధ్యక్షుని అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 204 మంది అనుకూలంగా ఓటు వేయగా, 85 మంది వ్యతిరేకించారు. దీనితో ఆయన అభిశంసనకు గురై అధికారాలను కోల్పోయారు. దర్యాప్తు అధికారులు ఆయనకు అనేక సమన్లు జారీ చేసినప్పటికీ, ఆయన స్పందించకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.