Spain: వరదలతో 'స్పెయిన్' అతలాకుతలం.. కొట్టుకుపోయిన వందలాది కార్లు
స్పెయిన్ వాలెన్సియాలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గల్లంతయ్యారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో వందలాది కార్లు వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. వాలెన్సియాలో వరదల కారణంగా ఇప్పటివరకు పలువురి మృతదేహాలను కనుగొన్నారు. సహాయక బృందాలు మరోవైపు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని ప్రభుత్వ అధికారి కార్లోస్ మజోన్ తెలిపారు. దక్షిణ స్పెయిన్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలతో వీధులు బురద నీటితో నిండిపోయాయి. ఇక డ్రోన్ల ద్వారా తప్పిపోయిన వారి కోసం గాలిస్తున్నారు.
వాలెన్సియాలో రెడ్ అలర్ట్
స్పెయిన్ కేంద్రం సంక్షోభ కమిటీని ఏర్పాటు చేసి, వరద ప్రభావంపై చర్చించింది. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ కోరారు. వాతావరణ విభాగం వాలెన్సియాలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో, అన్ని పాఠశాలలు, క్రీడా కార్యక్రమాలు నిలిపివేశారు. ఇక విమానాలు, రైళ్ల రాకపోకలను కూడా నిర్దిష్టంగా ఆపివేశారు. అండలూసియాలో 276 మంది ప్రయాణికులతో వస్తున్న హైస్పీడ్ రైలు వరదల కారణంగా పట్టాలు తప్పినప్పటికీ, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు.