Seal Team 6: బిన్ లాడెన్ హత్య నుంచి ఇరాన్ రక్షణ మిషన్ వరకు… సీల్ టీమ్ 6 సాహసాలు
ఈ వార్తాకథనం ఏంటి
చీకటితో కప్పుకున్న పర్వత ప్రాంతం... చుట్టూ ప్రమాదకర పరిస్థితులు. అలాంటి సమయంలో అమెరికాకు చెందిన అత్యంత రహస్య కమాండో బృందం సాహసోపేత ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఒకప్పుడు విదేశీ భూమిపై అడుగుపెట్టి కరుడుగట్టిన ఉగ్రవాదిని అంతమొందించిన అదే బృందం... ఇప్పుడు శత్రుదేశంలోకి చొరబడి తమ సైనికాధికారిని కాపాడింది. ఆ బృందమే 'సీల్ టీమ్ 6 (SEAL Team 6)'.
వివరాలు
ఇరాన్ వైఫల్యం నుంచి పుట్టిన ప్రత్యేక దళం
దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఇరాన్‌లో జరిగిన రాజకీయ ఉద్రిక్తతల సమయంలో 50మందికి పైగా అమెరికా ఎంబసీ సిబ్బంది,పౌరులు బందీలుగా చిక్కుకున్నారు.
వారిని రక్షించేందుకు అమెరికా'ఆపరేషన్ ఈగల్ క్లా'చేపట్టింది. కానీ ఈ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది.
ఆ ఆపరేషన్‌లో హెలికాప్టర్,సీ-130 విమానం ఢీకొనడంతో 8 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆపరేషన్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.
బందీలు మరో ఏడాది పాటు ఇరాన్‌లోనే నిర్బంధంలో ఉండి,తరువాత దౌత్య చర్చల ద్వారా విడుదలయ్యారు.
ఈ వైఫల్యం అమెరికా రక్షణ వ్యవస్థకు పెద్ద పాఠమైంది.బందీల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక దళం అవసరమని పెంటగాన్ నిర్ణయించింది.
ఆ బాధ్యతను నేవీ కమాండర్ రిచర్డ్ మార్సింకోకు అప్పగించగా.. ఆయన రూపుదిద్దిన దళమే 'సీల్ టీమ్ 6'.
వివరాలు
పేరుతోనే గందరగోళం సృష్టించిన వ్యూహం
ఈ బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఆరు నెలల సమయం ఇవ్వగా, మార్సింకో 75 మంది అత్యుత్తమ సైనికులను ఎంపిక చేశారు.
ఈ యూనిట్‌కు 'సీల్ టీమ్ 6' అనే పేరు పెట్టడంలో ఒక వ్యూహం ఉంది. అమెరికా ప్రత్యేక దళాల నిజమైన సామర్థ్యం బయటపడకుండా సోవియట్ రష్యాను మభ్యపెట్టేందుకు ఈ సంఖ్యను చేర్చారు.
ఈ బృందం యూఎస్ నేవీకి చెందినదే అయినప్పటికీ, జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
1987లో అధికారికంగా 'నేవల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్‌మెంట్ గ్రూప్'గా నమోదు చేసినప్పటికీ... 'సీల్ టీమ్ 6'అనే పేరే ప్రాచుర్యంలో ఉంది.
ఇందులో రెడ్, బ్లూ, గోల్డ్, సిల్వర్ అనే నాలుగు స్క్వాడ్రన్లు ఉంటాయి. ప్రతి స్క్వాడ్రన్‌లో సుమారు 50మంది కమాండోలు ఉంటారు.
వివరాలు
బిన్ లాడెన్ హత్యతో ప్రపంచ దృష్టి
ఇందులో చేరాలంటే ఆరు నెలల కఠిన శిక్షణ తప్పనిసరి. 2011లో పాకిస్థాన్‌లోని అబోట్టాబాద్‌లో అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను అంతమొందించిన ఘనత ఈ బృందానిదే.
దాదాపు 24 మంది కమాండోలు రహస్యంగా పాక్‌లోకి చొరబడి ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు.
ఈ సంఘటన ఆధారంగా తీసిన 'జీరో డార్క్ థర్టీ' సినిమా ఆస్కార్‌ను కూడా గెలుచుకుంది.
అంతకుముందు 2009లో సోమాలి దొంగలు అపహరించిన అమెరికా కెప్టెన్ రిచర్డ్ ఫిలిప్స్‌ను కూడా ఈ బృందమే రక్షించింది.
ఆ ఘటనపై 'కెప్టెన్ ఫిలిప్స్' అనే సినిమా రూపొందింది. ఇరాక్, అఫ్గానిస్థాన్‌లలో కూడా ఈ దళం పలు కీలక ఆపరేషన్లు చేపట్టింది.
వివరాలు
ఇరాన్‌లో మరోసారి సాహస గాథ
ఇరాన్‌లో జరిగిన వైఫల్యం కారణంగా పుట్టిన ఈ బృందం... ఇప్పుడు అదే దేశంలో విజయాన్ని నమోదు చేసింది.
ఇటీవల టెహ్రాన్ సమీపంలో అమెరికా ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూల్చివేయగా, అందులో ఉన్న ఇద్దరిలో ఒక పైలట్‌ను రక్షించారు.
అయితే మరో వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ కనిపించకుండా పోయాడు. ఆ అధికారి కోసం అమెరికా భారీ ఆపరేషన్ ప్రారంభించింది.
వివరాలు
ఇరాన్‌లో మరోసారి సాహస గాథ
ఇదే సమయంలో ఇరాన్ బలగాలు కూడా అతడిని వెతికాయి. శత్రువుల చేతికి చిక్కకుండా ఆ అధికారి పర్వత ప్రాంతంలోని ఒక రాతి పగులులో దాక్కున్నాడు.
సీఐఏ సహాయంతో అతడి ఆచూకీ తెలుసుకున్న అమెరికా సైన్యం... వెంటనే 'సీల్ టీమ్ 6'ను రంగంలోకి దించింది.
భీకర కాల్పుల మధ్య ఈ బృందం పర్వత ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి... చివరకు ఆ అధికారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.
దీంతో మరోసారి ఈ రహస్య దళం తమ ప్రతిభను చాటుకుంది.