హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక
చైనా గూఢచారి నౌక 'షి యాన్ 6'పై శ్రీలంక ద్వంద్వ వైఖరిని అవలభిస్తోందా? చైనా నౌకను హిందూ మహాసముద్రంలోకి అనుమతించే విషయంలో భారత్‌కు ఒక మాట.. బీజింగ్‌కు ఒక మాట శ్రీలంక చెబుతుందా? అంటే, తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి. చైనా నౌక 'షి యాన్ 6' హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి భారత్ వైపు దూసుకొస్తోంది. ఇప్పుడు ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో 90డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. ప్రస్తుతం ఇది శ్రీలంక వైపు కదులుతోంది. అంతకుముందు, చైనా నౌక రావడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, భారత్ ఆందోళన తమకు ముఖ్యమని, చైనా నౌకను తాము అనుమతించబోమని శ్రీలంక చెప్పింది.
చైనా ఒత్తిడికి శ్రీలంక తలొగ్గినట్టేనా?
శ్రీలంక ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు నౌకకు అనుమతి లేదు అంటూనే స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చైనా ఒత్తిడి మేరకు ఆ దేశ నౌకను శ్రీలంక అనుమంతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా ఒత్తిడికి శ్రీలంక తలొగ్గడానికి ప్రధానం కారణం.. బీజీంగ్ వద్ద చేసిన భారీ అప్పులే. రాజపక్స కాలంలో విక్రమసింఘే క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఐ కింద అధిక వడ్డీ రుణాలను చైనా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి శ్రీలంక పొందింది. ఈ అప్పులు మోయలేనంత భారం కావడంతో శ్రీలంక సంక్షోభంలోకి వెళ్లింది. ఆ ఖరికి శ్రీలంక రుణాలు తిరిగి చెల్లించలేక పోవడంతో కొంత మొత్తం కింద హంబన్‌తోట ఓడరేవును చైనాకు 99ఏళ్ల లీజుకు ఇచ్చింది విక్రమసింఘే ప్రభుత్వం.
అక్టోబరు 17, 18 తేదీల్లో చైనా పర్యటనకు వెళ్లనున్న విక్రమసింఘే
శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ చైనా నౌకను అనుమతించడంపై నిర్ణయం తీసుకోలేదు. భారత భద్రతా కారణాల దృష్ట్యా ఇంకా అధికారిక అనుమతి ఇవ్వలేదని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ తెలిపారు. అక్టోబరు 17, 18 తేదీల్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) 10వ వార్షికోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే బీజింగ్‌కు వెళ్లనున్నారు. ఆ సమయంలో షి యాన్ 6 నౌక శ్రీలంకలో ప్రవేశానికి అనుమతించే విషయంపై నిర్ణయం వెలువడుతుందని భారత్ భావిస్తోంది. ఇది చైనాకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే 'బీఆర్ఐ' కింద చైనా వద్ద శ్రీలంక భారీ మొత్తంలో అప్పు చేసింది. ఆ అప్పులకు తొలగ్గి చైనాకు అనుకూలంగా శ్రీలంక నిర్ణయం తీసుకున్నా.. ఆశ్చర్యపోనసరం లేదు.
ఇప్పటి వరకు 48 పరిశోధన నౌకలను మోహరించిన చైనా
ఈ 'షి యాన్ 6' అనేది.. షిప్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను స్థాపించడానికి చైనా 13వ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్న కీలక ప్రాజెక్ట్. షి యాన్ 6ను లాంచ్ చేసి రెండేళ్ల అవుతోంది. ఇది 2022లో తూర్పు హిందూ మహాసముద్రంలో తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు చైనా పరిశోధన నౌక కొలంబో నౌకాశ్రయంలోకి ప్రవేశించడానికి దూసుకొస్తోంది. చైనా 2019 నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతంలో దాదాపు 48 శాస్త్రీయ పరిశోధన నౌకలను మోహరించింది. ఈ నౌకలన్నీ బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్ వరకు ఉంటాయి. చైనా నౌక 'షి యాన్ 6' సెప్టెంబర్ 23న మలక్కా జలసంధి ద్వారా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది.