Arjuna Ranatunga: చమురు కుంభకోణం కేసులో శ్రీలంక 1996 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అరెస్టుకు రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక క్రికెట్‌కు 1996 ప్రపంచకప్‌ను అందించిన తొలి కెప్టెన్, అలాగే మాజీ పెట్రోలియం మంత్రి అర్జున రణతుంగపై అవినీతి ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రణతుంగ స్వదేశానికి చేరుకున్న వెంటనే అదుపులోకి తీసుకుంటామని అవినీతి నిరోధక దర్యాప్తు కమిషన్ సోమవారం కొలంబో కోర్టుకు తెలిపింది. 2017లో అర్జున రణతుంగ పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న కాలంలో, ఆయన సోదరుడు ధమ్మిక రణతుంగ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
వివరాలు
తదుపరి విచారణను మార్చి 13వ తేదీకి కోర్టు వాయిదా
ఆ సమయంలో దీర్ఘకాలిక చమురు సరఫరా ఒప్పందాల నిబంధనల్లో మార్పులు చేసి, స్పాట్ విధానంలో అధిక ధరలకు మొత్తం 27 సార్లు చమురు కొనుగోళ్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీల వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు 800 మిలియన్ శ్రీలంక రూపాయలు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.23.5 కోట్ల నష్టం జరిగిందని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ధమ్మిక రణతుంగను అధికారులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. విచారణ అనంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది. శ్రీలంకతో పాటు అమెరికా పౌరసత్వం కలిగిన ధమ్మిక దేశం విడిచి వెళ్లకుండా న్యాయస్థానం ప్రయాణ నిషేధం విధించింది. కేసు తదుపరి విచారణను మార్చి 13వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
వివరాలు
అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న శ్రీలంక కొత్త ప్రభుత్వం
అవినీతి నిర్మూలననే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని గత ఏడాది అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే నేతృత్వంలోని ప్రభుత్వం, ఉన్నత స్థాయి వ్యక్తులపై కఠిన చర్యలకు దిగింది. ఆ చర్యలలో భాగంగానే రణతుంగ సోదరులపై ఈ కేసులు నమోదైనట్లు సమాచారం. ఇదే క్రమంలో, రణతుంగ కుటుంబానికి చెందిన మరో సోదరుడు, మాజీ మంత్రి ప్రసన్నను కూడా గత నెలలో ఓ ఇన్సూరెన్స్ మోసం కేసులో అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.