Musk Starlink Slowdown: మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ స్లోడౌన్.. డ్రోన్లకు బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్ అధిపతి, బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఉక్రెయిన్‌లో డ్రోన్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటానికి స్టార్‌లింక్ ఉపగ్రహ నెట్వర్క్ వేగం తగ్గడమే కారణమన్న విషయం తెలిసిందే. అయితే నెట్వర్క్ వేగాన్ని తగ్గించాలని మస్క్ స్వయంగా ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ఇద్దరు అమెరికా అధికారులు, సంబంధిత వర్గాలు వెల్లడించిన సమాచారాన్ని ఉటంకించింది. స్టార్‌లింక్ నెట్వర్క్ వేగాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గించాలని మస్క్ ఆదేశించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిర్ణయం ఉక్రెయిన్‌లో ఆందోళనకు దారితీసిందని, అమెరికా యంత్రాంగాన్ని కూడా అయోమయానికి గురిచేసిందని వెల్లడించాయి.
వివరాలు
ఆంక్షలు విధించినట్లు సమాచారం
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో డీజిల్ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలోనే యుద్ధరంగంలో ఉక్రెయిన్ డ్రోన్లు వేగాన్ని కోల్పోయినట్లు కథనం పేర్కొంది.
అమెరికా మద్దతు తగ్గుతున్న నేపథ్యంలో రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ వినియోగిస్తున్న స్టార్‌లింక్ కమ్యూనికేషన్ పరికరాలపై మస్క్ ఆంక్షలు విధించినట్లు గతంలో వార్తలొచ్చాయి.
అయితే ఆ ఆరోపణలను మస్క్ అప్పట్లో తోసిపుచ్చారు. సైనిక అవసరాల కోసం ఉపయోగించే స్టార్‌లింక్ సేవల విభాగమైన స్టార్‌షీల్డ్ (Starshield) అమెరికా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు స్టార్‌లింక్ సేవల వేగం తగ్గింపు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే వెల్లడించారు.
వివరాలు
ఉక్రెయిన్ విజయం సాధించాలి
ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, ఉక్రెయిన్ విజయం సాధించాలని కోరుకుంటున్నామని వారు వివరించారు.
భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని స్టార్‌లింక్ ప్రయత్నిస్తున్న తరుణంలో, ఉక్రెయిన్‌లో ఆ సంస్థ నెట్వర్క్ వినియోగంపై వచ్చిన ఈ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే నెట్వర్క్ వేగాన్ని తగ్గించాలని మస్క్ ఆదేశించారన్న విషయం ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కథనంలో వచ్చిన ఆరోపణ మాత్రమే.