Starving on the front lines: రష్యా దాడులతో పాటు ఆకలితోనూ పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ సైనికులు యుద్ధభూమిలో రష్యా దాడులను మాత్రమే కాదు, తీవ్రమైన ఆకలిదప్పులను కూడా ఎదుర్కొంటున్నారని అంతర్జాతీయ మాధ్యమాలు వెల్లడిస్తున్నాయి. చాలాకాలంగా సరైన ఆహారం అందక శరీరాలు పూర్తిగా క్షీణించిన నలుగురు ఉక్రెయిన్ సైనికుల చిత్రాలు గత ఏప్రిల్‌లో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. వారు వరుసగా 17 రోజుల పాటు ఆహారం లేకుండానే గడిపినట్లు, నెలల తరబడి సరుకుల సరఫరా కూడా అందలేదని కథనాలు పేర్కొన్నాయి. రష్యా ఆత్మాహుతి డ్రోన్లు ఎప్పటికప్పుడు నిఘా కొనసాగించడం వల్ల యుద్ధభూమిలో ఉన్న సైనికులకు ఆహారం, ఇతర అవసరమైన వస్తువులు చేరవేయడం కష్టసాధ్యంగా మారిందని సమాచారం. యాంత్రిక వాహనాల సహాయంతో సరుకులు పంపే అవకాశం ఉన్నప్పటికీ, వాటికి మార్గనిర్దేశం చేసే గగన పర్యవేక్షణ పరికరాలు అవసరమవుతున్నాయి.
వివరాలు
ఆకలి తట్టుకోలేక యుద్ధరంగంలోనే స్పృహ తప్పిన సైనికులు
అయితే అవి రష్యా దృష్టికి చిక్కితే సరఫరా వ్యవస్థతో పాటు సైనికుల ప్రాణాలకూ ప్రమాదం ఏర్పడుతుందని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఆకలిని తట్టుకోలేక పలువురు సైనికులు యుద్ధరంగంలోనే స్పృహ తప్పి పడిపోవడం సాధారణమైందని కీవ్‌కు చెందిన అనస్తాసియా సిల్చుక్ తెలిపారు. ఆమె భర్త 14వ యాంత్రిక దళంలో సేవలందిస్తున్నారు. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని ఒక భూగర్భ స్థావరంలో చాలాకాలం ఒంటరిగా గడిపిన ఓలెక్సాండర్ అనే సైనికుడు తన అనుభవాలను పంచుకున్నారు.
వివరాలు
800 డ్రోన్లతో రష్యా భారీ దాడి
''ఆ సమయంలో నాకు నా కుటుంబం ఎంతగానో జ్ఞాపకం వచ్చింది. అంతకన్నా ఎక్కువగా నేను కలలు కన్నది వేడివేడి భోజనాన్ని గురించి'' అని అన్నారు.. యుద్ధభూమిపై నిరంతరం తిరుగుతున్న డ్రోన్ల కారణంగా సైనికుల కదలికలు పూర్తిగా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. భూగర్భ స్థావరాల నుంచి బయటకు రావడానికీ వారు భయపడే పరిస్థితి నెలకొంది. రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై విపరీత స్థాయిలో గగనదాడులు జరిపింది. దేశంలోని 20 ప్రాంతాలపై బుధవారం ఉదయం దాదాపు 800 డ్రోన్లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.
వివరాలు
ఒడెసా ప్రాంతంపై జరిగిన దాడిలో రేవుకు తీవ్ర నష్టం
ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటిగా ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడినట్లు ఆయన తెలిపారు. "రష్యా మా దేశంపై ఉద్దేశపూర్వకంగా దాడులు కొనసాగిస్తోంది. రైల్వే మౌలిక సదుపాయాలతో పాటు నగరాల్లోని పౌర అవసరాల నిర్మాణాలను ధ్వంసం చేస్తోంది" అని ఆయన సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. మధ్య ప్రాంతమైన ద్నిప్రో, ఈశాన్య ఖార్కివ్ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో నివాస భవనాలు, రైల్వే సదుపాయాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. అలాగే ఒడెసా ప్రాంతంపై జరిగిన దాడిలో రేవుకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే 14 ప్రాంతాలపై రష్యా ఏకకాలంలో దాడులు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు.