
UK Visa: బ్రిటన్ వీసా కఠిన నిబంధనలు.. ఉద్యోగ కలలు కన్న భారతీయులకు షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ ప్రభుత్వం వీసా, వలస చట్టాల్లో భారీ మార్పులు చేపట్టేందుకు యోచిస్తోంది. వలస కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, యూకేలో ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తున్న వలసదారులు, ముఖ్యంగా భారతీయులపై ప్రభావం చూపనుంది.
ఈ నేపథ్యంలో ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్‌లో శ్వేతపత్రం ప్రవేశపెట్టనుందని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
ప్రస్తుతం యూకేలో వలసలు, విదేశీయులపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, రిఫార్మ్ యూకేకు వస్తున్న మద్దతు ఈ నిర్ణయానికి దోహదం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Details
2024లో 2,10,098 వర్క్ వీసాలు జారీ
2024లో బ్రిటన్ 2,10,098 వర్క్ వీసాలు జారీ చేసింది. ఇది గతేడాది 2023తో పోల్చితే 37 శాతం తగ్గుదల. అందులో 1,16,000 వీసాలు భారతీయులకు మంజూరయ్యాయి.
గత ఏడాది ఈ సంఖ్య 1,27,000. ఎక్కువగా వైద్యం, ఐటీ, ఇంజినీరింగ్, విద్య, ఆతిథ్యం, కేటరింగ్, ట్రేడ్ రంగాల్లో వీసాలు మంజూరయ్యాయి.
ప్రధాని స్టార్మర్ ప్రకారం, దేశానికి అవసరమైన నైపుణ్యాలున్న వారికి మాత్రమే బ్రిటన్‌లో ఉన్న అవకాశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
వలస వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ పెంచడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.
Details
ముఖ్య ప్రతిపాదిత మార్పులు ఇవే
స్కిల్డ్ వర్కర్ వీసాకు కనీసం యూనివర్సిటీ డిగ్రీ అవసరం.
ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలపై కఠినమైన ప్రమాణాలు అమలు.
వీసాదారుల ఆధారితులకూ బేసిక్ ఇంగ్లిష్ నైపుణ్యం తప్పనిసరి.
పర్మినెంట్ రెసిడెన్సీ కోసం 10 సంవత్సరాలు యూకేలో నివసించాలి (ప్రస్తుత 5 సంవత్సరాల బదులు).
ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే యూకే వలస విధానాల్లో భారీ మార్పు చోటు చేసుకోనుంది. వీసా ఆశిస్తున్నవారు, పని చేయాలనుకునే విదేశీయులు కొత్త అర్హతల్ని అనుసరించాల్సి ఉంటుంది.