Sudanese: సూడాన్‌లో డ్రోన్ దాడి.. 15 మంది మృతి,భయాందోళనలో ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
సూడాన్‌లో సైన్యం, పారా మిలటరీ బలగం ఆర్‌ఎస్‌ఎఫ్ (రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్) మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న అధికార పోరు సామాన్య ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. బుధవారం రాత్రి ఎల్ ఒబెయిద్ నగరంలోని పలు ప్రాంతాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో కనీసం 15 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం.. నగరంలోని సైనిక స్థావరంతో పాటు ఆహార సరుకులు తీసుకెళ్తున్న ట్రక్కు, గ్యాస్ స్టేషన్, అలాగే శ్మశాన వాటిక వద్ద గుమికూడిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో డజన్ల సంఖ్యలో ప్రజలు గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎల్ ఒబెయిద్ ఆస్పత్రి వైద్య సిబ్బంది వెల్లడించారు.
వివరాలు
దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సైన్యం-ఆర్‌ఎస్‌ఎఫ్ ఘర్షణలు
దాడుల అనంతరం కూడా నగరంపై డ్రోన్లు సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాఠశాలలను మూసివేసిన అధికారులు, మార్కెట్లను పాక్షికంగా మాత్రమే తెరవడానికి అనుమతి ఇచ్చారు. సూడాన్‌లో సైన్యం-ఆర్‌ఎస్‌ఎఫ్ మధ్య జరుగుతున్న ఘర్షణలు గత మూడేళ్లుగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పోరులో ఇప్పటివరకు కనీసం 60 వేల మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 1.30 కోట్ల మంది తమ ఇళ్లను విడిచి నిరాశ్రయులుగా మారినట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంచనా వేసింది.