USA: యుద్ధానికి బ్రేక్ వేయాలని సూచనలు..? ట్రంప్ నిర్ణయంపై చర్చ!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం భవిష్యత్తుపై అంతర్జాతీయంగా చర్చలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో ది వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా సంచలన కథనాన్ని ప్రచురించింది. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి వైదొలుగుతున్నట్లు బహిరంగంగా ప్రకటించాలని ఆయనకు సలహాదారులు సూచిస్తున్నారని పేర్కొంది. ఈ సమాచారం అమెరికా అధికార వర్గాల నుంచే అందిందని ఆ పత్రిక వెల్లడించింది. కథనం ప్రకారం, ఇరాన్ అణు వ్యవస్థలను దెబ్బతీయాలన్న అమెరికా ప్రధాన లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లు అధికారులు భావిస్తున్నారని తెలిపింది. యుద్ధం ప్రారంభించినప్పటి కంటే ఎక్కువ లక్ష్యాలను అమెరికా సైన్యం సాధించిందని కూడా వారు పేర్కొన్నట్లు సమాచారం.
Details
వార్తలను పూర్తిగా ఖండించిన ది వైట్ హౌస్
ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యుద్ధం నుంచి బయటకు వచ్చినా అమెరికాకు ఎలాంటి నష్టం ఉండదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోందని కథనం వెల్లడించింది. అదేవిధంగా ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన టారిఫ్‌లు, అలాగే దీర్ఘకాలం కొనసాగుతున్న యుద్ధాలు దేశీయంగా ప్రజలలో అసంతృప్తిని పెంచే అవకాశముందని అధికారులు భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ కారణాలతోనే యుద్ధం నుంచి బయటపడటం మంచిదని ట్రంప్‌కు కొందరు సలహా ఇచ్చినట్లు కథనంలో చెప్పింది. అయితే ఈ వార్తలను ది వైట్ హౌస్ పూర్తిగా ఖండించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ, ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం విషయంలో ట్రంప్‌కు ఎవరూ అలాంటి సలహాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
Details
లక్ష్యాలు పూర్తయ్యే వరకు ట్రంప్ తన పోరాటాన్ని ఆపరు
ఈ అంశంపై ప్రచారంలో ఉన్న కథనాల్లో నిజం లేదని తెలిపారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో విజయాన్ని సాధించేందుకు ట్రంప్ పాలనలోని అగ్ర సహాయకులు నిరంతరం పనిచేస్తున్నారని ఆమె చెప్పారు. నిర్ణయించిన లక్ష్యాలు పూర్తయ్యే వరకు ట్రంప్ తన పోరాటాన్ని ఆపరని పేర్కొన్నారు. ఒకవేళ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని కమాండర్-ఇన్-చీఫ్ అయిన ట్రంప్ స్వయంగా బహిరంగంగా ప్రకటిస్తారని కూడా ఆమె స్పష్టం చేశారు.