రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటన నిమిత్తం సురినామ్ దేశంలో అడుపెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రెసిడెంట్ సంతోఖి, ముర్మును ఘనంగా స్వాగతించారు. ఈ పర్యటనలో భాగంగా ముర్ము సురినామ్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు సురినామ్ అధ్యక్షుడు చంద్రికా పర్సాద్ సంతోఖి ఈ గౌరవాన్ని భారత రాష్ట్రపతికి అందించారు. అనంతరం స్పందించిన ముర్ము, సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కడం తనకు సంతోషంగా ఉందన్నారు.
భారత్ సురినామ్ మధ్య పలు ఒప్పందాలు ఖరారు
3 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలకు ముర్ము నాయకత్వం వహించారు. ఆతిథ్య దేశాధ్యక్షుడు సంతోఖితో ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం పలు ఒప్పందాలు కుదిరాయి. సురినామ్ లో భారతీయుల రాకకు సంబంధించిన 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, భారత రాష్ట్రపతిగా తన మొదటి విదేశీ పర్యటన జరగడం పట్ల భారత తొలి పౌరురాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సురినామ్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్రపతి భవన్ ట్వీట్ ద్వారా వెల్లడించింది.