వరుస భూకంపాలతో అల్లాడిపోయిన తజికిస్థాన్; విరిగిపడ్డ కొండచరియలు
వరుస భూకంపాలతో తజకిస్థాన్ వణికిపోయింది. తూర్పు తజికిస్థాన్‌లో 6.8, 5.0, 4.6 తీవ్రతలతో వెంట వెంటనే భూమి కంపించడంతో ప్రజలు అల్లాడిపోయారు. గురువారం తొలుత 6.8తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5:37 గంటలకు 20.5 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. అఫ్ఘనిస్తాన్, చైనా సరిహద్దులో ఉన్న సెమీ అటానమస్ తూర్పు ప్రాంతం - గోర్నో-బదక్షన్ ప్రాంతానికి సమీపంలో భూకంప కేంద్రం ఉంది.
ఇరవై నిమిషాల తర్వాత, 5.0, 4.6 తీవ్రతలతో కంపించిన భూమి
6.8తీవ్రతతో ప్రకంపనలు వచ్చిన ఇరవై నిమిషాల తర్వాత, 5.0, 4.6 తీవ్రతలతో వరుస భూకంపాలు సంభవించినట్లు యూఎస్‌జీఎస్ పేర్కొంది. అయితే భూకంపాలు సంభవించిన ప్రాంతంలో జనసాంధ్రత చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. చుట్టూ ఎత్తైన పామిర్ పర్వతాలు ఉండటంతో ఈ ప్రాంతంలో భూకంపాల ధాటికి కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఏజెన్సీ అంచనా వేసింది. 1911లో సంభవించిన భూకంపం ఫలితంగా ఏర్పడిన ఆక్వామారిన్-రంగు నీరు తజికిస్తాన్‌లోని అతిపెద్ద సరస్సులలో ఒకటి.