LOADING...
Taliban: స్మార్ట్‌ఫోన్లపై తాలిబన్ల నిషేధం.. వాడితే ఫోన్లు ధ్వంసం, కఠిన శిక్షలు!
స్మార్ట్‌ఫోన్లపై తాలిబన్ల నిషేధం.. వాడితే ఫోన్లు ధ్వంసం, కఠిన శిక్షలు!

Taliban: స్మార్ట్‌ఫోన్లపై తాలిబన్ల నిషేధం.. వాడితే ఫోన్లు ధ్వంసం, కఠిన శిక్షలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో పాటు తమ సంస్థకు చెందిన సభ్యులు స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే మొబైల్ ఫోన్లను ధ్వంసం చేయడంతో పాటు షరియా చట్టాల ప్రకారం శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. తాలిబన్ల మిలిటరీ కోర్టులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఉన్నతాధికారులు, దిగువ స్థాయి సిబ్బంది, ముజాహిదీన్లు, సేవా సిబ్బంది ఎవరూ స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించకూడదు. ప్రత్యేక అనుమతి కావాలంటే తాలిబన్ల సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు 

స్మార్ట్‌ఫోన్లపై పూర్తిస్థాయి నిషేధానికి ఇది తొలి అడుగు

ఈ ఆదేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో తాలిబన్ అధికారి నిషేధ ఉత్తర్వులను చదువుతుండగా, మరో వ్యక్తి మొబైల్ ఫోన్లను పగులగొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఆంక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు సమాచారం. కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం చేసినా, మరికొన్ని ప్రాంతాల్లో మహిళలు, సాధారణ ప్రజలు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులపై కూడా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లపై పూర్తిస్థాయి నిషేధానికి ఇది తొలి అడుగు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ప్రజల స్పందనను తాలిబన్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

స్మార్ట్‌ఫోన్లపై తాజా ఆంక్షలకు మరో కారణం

ఇటీవల అఫ్గానిస్థాన్‌ను ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థ నుంచి వేరు చేయాలనే ప్రయత్నాలను కూడా తాలిబన్లు ముమ్మరం చేశారు. గతంలో అసభ్యకర కంటెంట్ వ్యాప్తిని అడ్డుకోవాలనే కారణంతో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయగా, వ్యాపారాలు, బ్యాంకింగ్ సేవలు, అత్యవసర సేవలు, విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. స్మార్ట్‌ఫోన్లపై తాజా ఆంక్షలకు మరో కారణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల హెరాత్ నగరంలో మహిళల హిజాబ్ వ్యవహారంపై జరిగిన నిరసనల్లో తాలిబన్ల చర్యలకు సంబంధించిన వీడియోలు బయటకు రావడం వారిని అప్రమత్తం చేసినట్లు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు.

Advertisement

వివరాలు 

తాలిబన్లకు ఆందోళన కలిగించే విషయం ఇదే.. 

అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఎక్కువ సమయం ఫోన్లలో గడపడం, కీలక పత్రాలు, సమావేశాల వివరాలను ఫొటోలు తీసి బయటకు లీక్ చేయడం కూడా తాలిబన్లకు ఆందోళన కలిగిస్తోంది. హెరాత్ ప్రావిన్స్‌లో ఇప్పటికే కొందరు ఉద్యోగుల నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం వల్ల ఉత్పాదకత తగ్గుతుందనే చర్చ ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా నిషేధిస్తూ చట్టాలు తీసుకురావడం చాలా అరుదని విశ్లేషకులు చెబుతున్నారు. తాలిబన్ల తాజా నిర్ణయం అఫ్గానిస్థాన్‌లో సమాచార స్వేచ్ఛ, డిజిటల్ హక్కులపై మరిన్ని ఆందోళనలకు దారితీస్తోంది.

Advertisement