LOADING...
Nur Khan Airbase: పాకిస్థాన్‌ నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై అఫ్గానిస్థాన్‌ డ్రోన్‌ దాడి
పాకిస్థాన్‌ నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై అఫ్గానిస్థాన్‌ డ్రోన్‌ దాడి

Nur Khan Airbase: పాకిస్థాన్‌ నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై అఫ్గానిస్థాన్‌ డ్రోన్‌ దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ (Afghan-Pak) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఇరుదేశాల బలగాలు పరస్పరం భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున తమ వైమానిక దళం పాకిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు అఫ్గాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రావల్పిండిలో ఉన్న పాక్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఉన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ (Nur Khan Airbase)పై భారీ స్థాయిలో దాడులు జరిపినట్లు తెలిపింది. అలాగే క్వెట్టాలోని 12వ కార్ప్స్‌ ప్రధాన కార్యాలయం, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని పలు ముఖ్య సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది.

వివరాలు 

తీవ్రంగా దెబ్బతిన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌,ఇతర సైనిక స్థావరాలు

తమ దేశంలోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్‌ వైమానిక దాడులకు దిగిందని ఆరోపించిన అఫ్గాన్‌, పాక్‌ చొరబాట్లకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేపట్టినట్లు స్పష్టం చేసింది. తమ దాడుల ఫలితంగా నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌తో పాటు ఇతర సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. మరోవైపు తూర్పు అఫ్గానిస్థాన్‌లోని జలాలాబాద్‌లో పాకిస్థాన్‌కు చెందిన యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు తాలిబన్‌ వర్గాలు ప్రకటించాయి. ఆ విమాన పైలట్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించాయి. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌ నిర్వహించిన దాడుల్లో నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ దెబ్బతినగా, పాకిస్థాన్‌ ఇప్పటికీ మరమ్మతులు చేపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అఫ్గాన్‌ బలగాలు అదే స్థావరాన్ని మళ్లీ లక్ష్యంగా చేసుకోవడంతో పాకిస్థాన్‌కు మరింత నష్టం సంభవించినట్లు సమాచారం.

Advertisement