Nepal: నేపాల్ వరదల్లో టీచర్ సమయస్ఫూర్తి.. 1,643 మంది పిల్లలకు ప్రాణదానం
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో బుధవారం ప్రారంభమైన వరదలు వందలాది మందిని బలిగొన్నాయి. ఇప్పటికీ అనేక మంది ఆచూకీ తెలియకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విధ్వంసం మధ్య ఓ ఉపాధ్యాయుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏకంగా 1,643 మంది చిన్నారులను కాపాడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నేపాల్‌లోని త్రిశూలి ప్రాంతంలో ఉన్న త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న రాజేంద్ర దవాడికి బుధవారం ఉదయం వరద హెచ్చరిక అందింది. పరిస్థితి తీవ్రతను వెంటనే గుర్తించిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాఠశాలలో అలారం మోగించారు. అనంతరం ఇతర ఉపాధ్యాయుల సహాయంతో పాఠశాలలో ఉన్న 1,643 మంది విద్యార్థులను ఒకచోటుకు చేర్చారు. అదే సమయంలో స్కూల్ బస్సు డ్రైవర్లను కూడా అప్రమత్తం చేశారు.
వివరాలు
అభినందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
విద్యార్థులను బస్సుల్లో సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే అప్పటికే వరద ఉద్ధృతికి స్థానికంగా ఉన్న రహదారులు, భవనాలు కొట్టుకుపోతుండటంతో విద్యార్థులను మరో సురక్షిత ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు.
వెంటనే పాఠశాలకు సమీపంలోని ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఓ భారీ వృక్షం కిందకు విద్యార్థులను తీసుకెళ్లారు. విద్యార్థులను అక్కడికి తరలించిన కొన్ని నిమిషాలకే ఊహించని విధంగా భారీ వరద పాఠశాల ప్రాంతాన్ని ముంచెత్తింది.
వరద ఉద్ధృతికి మూడు అంతస్తుల పాఠశాల భవనం పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పాఠశాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ముందస్తు హెచ్చరికను గుర్తించి వెంటనే అప్రమత్తంగా వ్యవహరించడంతో 1,643మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన టీచర్ రాజేంద్ర దవాడిని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు అభినందిస్తున్నారు.