LOADING...
INDw vs NEDw: నెదర్లాండ్స్‌ను చిత్తుచేసిన టీమిండియా.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానం కైవసం!
నెదర్లాండ్స్‌ను చిత్తుచేసిన టీమిండియా.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానం కైవసం!

INDw vs NEDw: నెదర్లాండ్స్‌ను చిత్తుచేసిన టీమిండియా.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానం కైవసం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా, బుధవారం నెదర్లాండ్స్‌పై ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్‌-Aపాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తదుపరి మ్యాచ్‌లో జూన్ 21న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బౌలింగ్ ఎంచుకొని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభం నుంచే భారత ఓపెనర్లు స్మృతి మంధాన (47 బంతుల్లో 74 పరుగులు), షెఫాలీవర్మ (38 బంతుల్లో 55 పరుగులు) దూకుడుగా ఆడి జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 70 బంతుల్లో 115 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

వివరాలు

4 వికెట్లతో చెలరేగిన శ్రీ చరణి

దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగింది. ఇన్నింగ్స్ చివర్లో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె కేవలం 8 బంతుల్లో 20 పరుగులు చేసింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్లు సమష్టిగా చెలరేగారు. శ్రీ చరణి 4 వికెట్లతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను దెబ్బతీయగా, పార్ట్‌టైమ్ బౌలర్ షెఫాలీ వర్మ 3 వికెట్లు తీశారు. నందిని శర్మ 2 వికెట్లు, దీప్తి శర్మ 1 వికెట్ సాధించారు. నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది.

వివరాలు

95 పరుగుల తేడాతో విజయం

దీంతో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌కు 2 పాయింట్లు దక్కడమే కాకుండా, నెట్‌రన్‌రేట్ కూడా గణనీయంగా పెరిగి +3.975కి చేరింది. పాయింట్ల పట్టికలో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ మహిళల జట్టు ఒక విజయంతో మూడో స్థానంలో ఉంది. లీగ్ దశ ముగిసే సమయానికి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి

Advertisement