లండన్ ఫ్లాట్ లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య.. శోకసంద్రంలో కుటుంబం
హైదరాబాద్ యువతి ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో దారుణ హత్యకు గురైంది. ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన తేజస్విని ఇంగ్లీష్ దేశంలో ప్రాణాలు వదిలింది. ఈ మేరకు బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలోనే మరో యువతి తీవ్ర గాయాలపాలైంది. రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తేజస్విని ఎంఎస్ చదివేందుకు కొంతకాలం కిందట లండన్ వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి నివసిస్తూ చదువుకుంటోంది. అయితే ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం బ్రెజిల్ దేశానికి చెందిన ఓ యువకుడు తేజస్విని సహా మరో యువతి అఖిలపై ఆకస్మికంగా విరుచుకుపడ్డాడు.
తండ్రి ఆరోగ్యం బాగోలేదంటే ఇటీవలే హైదరాబాద్ వచ్చిన తేజస్విని
బ్రెజిల్ యువకుడి ఆకస్మిక దాడిలో తేజస్విని ఘటనా స్థలంలోనే మరణించింది. తీవ్ర గాయాలపాలైన అఖిల ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఊరు గానీ ఊరు దేశం గానీ దేశం నుంచి కుమార్తె తేజస్విని మరణించిందని స్నేహితుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారం నెలకొంది. బాధిత తండ్రి శ్రీనివాసులరెడ్డి ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నారు. తల్లి ఇంట్లోనే ఉంటోంది. 6 నెలల క్రితం తండ్రికి అనారోగ్యం కారణంగా తేజస్విని స్వస్థలానికి వచ్చింది. నెల రోజులపాటు తల్లిదండ్రులతోనే ఉండి తిరిగి లండన్ వెళ్లింది.
తేజస్విని ఉంటున్న ఫ్లాట్ ఎదురుగానే నిందితుడి నివాసం
మరో 2 నెలల్లో తన ఎంఎస్ కంప్లీట్ అయ్యి మంచి ఉద్యోగం వస్తుందనే శుభవార్తను తల్లిదండ్రులతో పంచుకుంది. చదువు పూర్తి అవుతుండటంతో, మరోవైపు తనకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. రెండు నెలల్లో హైదరాబాద్ వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పిన తమ అమ్మాయి తిరిగిరాని లోకాలకు వెళ్లడాన్ని ఆ అమ్మనాన్నలు జీర్ణించుకోలేకపోతున్నారు. తేజస్విని నాలుగేళ్లుగా లండన్ లోనే మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతోంది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి షేరింగ్ అపార్ట్ మెంట్ లో ఉంటోంది. తేజస్విని ఉంటున్న ఎదురు ఫ్లాట్ లో బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు ఉంటున్నాడు. వారి మధ్య గొడవేం జరిగిందో తెలియదు, అంతలోనే ఈ కిరాతకుడు తేజస్వినిని పొట్టనబెట్టుకున్నాడు.