Telegram: నీట్ పేపర్ లీక్ కలకలం.. టెలిగ్రామ్‌పై కేంద్రం యాక్షన్, సీఈవో రియాక్షన్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
నీట్-యూజీ రీటెస్ట్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పరీక్షల సమగ్రతను కాపాడే చర్యల్లో భాగంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ తీవ్రంగా తప్పుపట్టారు. తప్పు చేసిన కొందరి కారణంగా భారత్‌లోని 15 కోట్లకుపైగా సాధారణ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేయడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. కొంతమంది వినియోగదారులు లీకైన ప్రశ్నపత్రాలను టెలిగ్రామ్ ద్వారా పంచుకున్నారనే కారణంతో భారత ఐటీశాఖ వారంపాటు యాప్‌పై ఆంక్షలు విధించిందన్నారు. అయితే ఈ చర్య అసలు నిందితులను లక్ష్యంగా చేసుకోవాల్సింది పోయి, కోట్లాది చట్టబద్ధమైన వినియోగదారులపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
వివరాలు
టెలిగ్రామ్ అనేది సమాజానికి ఉపయోగపడే వేదిక
లీకైన పరీక్షా మెటీరియల్‌కు సంబంధించిన వందలాది ఛానళ్లను ఇప్పటికే తొలగించినట్లు దురోవ్ వెల్లడించారు. అలాగే తేదీల్లో మార్పులు చేసి మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు 'ఎడిటెడ్' అనే గుర్తింపును మరింత స్పష్టంగా కనిపించేలా మార్పులు చేస్తున్నామని తెలిపారు. టెలిగ్రామ్ అనేది సమాజానికి ఉపయోగపడే వేదిక అని,దానిని తాత్కాలికంగానైనా నిషేధించడం సరైన నిర్ణయం కాదన్నారు. అంతేకాకుండా ఈ ఆంక్షల వల్ల సమాచారం లీక్ కావడం ఆగిపోదని, అక్రమ కార్యకలాపాలు ఇతర యాప్‌లకు మారే అవకాశమే ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై ఈ తాత్కాలిక ఆంక్షలు అమలు చేసింది. అంతేకాకుండా జూన్ 30 వరకు భారత్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని ఆదేశించింది.
వివరాలు
నీట్ పరీక్ష విశ్వసనీయతను, పారదర్శకతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం
ఈ చర్యల వల్ల సాధారణ వినియోగదారులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్ పరీక్ష విశ్వసనీయతను, పారదర్శకతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టేందుకు అవసరమైన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది.