వైట్‌హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వద్ద ఓ తెలుగు కుర్రాడు హల్ చల్ చేశాడు. అద్దెకు తీసుకున్న ట్రక్కుతో వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌లో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. వైట్ హౌస్ సమీపంలోని లఫాయెట్ స్క్వేర్ వద్ద బారీకేడ్లను బలంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో అలర్ట్ అయిన భద్రతా బలగాలు అతన్ని పట్టుకొని వాషింగ్టన్ డీసీ పోలీసులకు అప్పగించారు. దాడికి యత్నించిన కుర్రాడిని కందుల సాయి వర్షిత్ గురించారు. మిస్సోరీలోని సెయింట్ లూయిస్ శివారులో గల చెస్టర్‌ఫీల్డ్‌లో సాయి వర్షిత్ నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కుటుంబ సభ్యులను చంపేస్తానని, కిడ్నాప్ చేస్తానని, హాని చేస్తానని హర్షిత్ బెదిరించినట్లు పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు.
సాయి వర్షిత్ తీసుకొచ్చిన ట్రక్కుపై నాజీల జెండా
కందుల సాయి వర్షిత్ ట్రక్కుపై నాజీల జెండా ఉండటం గమనార్హం. పార్క్ పోలీస్, సీక్రెట్ సర్వీస్ అధికారులు సాయికి దగ్గరాగ వెళ్లడంతో అతను బిగ్గరగా అరిచినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే తాను ట్రక్కుతో వైట్ హౌస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు, జో బైడెన్‌ను చంపాలనే ఉద్దేశాన్ని సాయి వ్యక్తం చేసినట్లు పోలీసులు తమ విచారణ రిపోర్డులో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇదిలా ఉంటే, కందుల సాయి వర్షిత్ మానసిక ఆరోగ్యంపై కూడా పోలీసులు ఆరా తీసుకున్నారు. అయితే అతన్ని ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారనేది తెలియాల్సి ఉంది.