Iran-Israel:పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణుల దాడి
ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. గత రాత్రి ఇరాన్ వందల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను శత్రు దేశంపై వేసిన విషయం తెలిసిందే. వీటిలో ఒక క్షిపణి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌లోని మొస్సాద్ ప్రధాన కార్యాలయం సమీపంలో పడింది. ఇక క్షిపణి పడిన సమయంలో పెద్ద ఎత్తున దుమ్ము కమ్ముకోవడంతో పాటు ఆ ప్రాంతంలో పార్క్ చేసిన వాహనాలు మట్టిలో మునిగిపోయాయి. ఈ గుంతకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హెజ్‌బొల్లా ప్రాంతంలో ఐడీఎఫ్ దళాల తీవ్ర దాడులకు అనంతరం ఇరాన్ ఈ ప్రత్యక్ష దాడికి దిగినట్లు తెలుస్తోంది.
అప్రమత్తమైన ఇరాన్ ప్రజలు
ఇరాన్ క్షిపణుల దాడిని చూశాక ఇజ్రాయెల్ ప్రజలు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగించారు. ఈ దాడులు చనిపోయిన హమాస్ అధినేత ఇస్మాయెల్ హనీయా, హెజ్‌బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మరణానికి ప్రతీకారంగా చేపట్టినట్లు ఇరాన్ దాడి అనంతరం అధికారికంగా ప్రకటించింది. 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2' పేరుతో ఈ దాడులు జరుగుతున్నాయని ఇరాన్ మిలటరీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నెవాటిమ్ ఎయిర్ బేస్, ఎఫ్-35 ఫైటర్ జెట్‌లతో పాటు అక్కడి మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. టెహ్రాన్‌కు ఈ దాడికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.