LOADING...
Cuba: క్యూబాపై ఒత్తిడి పెంచిన అమెరికా.. కరీబియన్‌లో సైనిక కదలికలు ముమ్మరం
కరీబియన్‌లో సైనిక కదలికలు ముమ్మరం

Cuba: క్యూబాపై ఒత్తిడి పెంచిన అమెరికా.. కరీబియన్‌లో సైనిక కదలికలు ముమ్మరం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, క్యూబా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. క్యూబాపై ఒత్తిడి పెంచే దిశగా అమెరికా పలు మార్గాల్లో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇంధన సరఫరాలకు సంబంధించి ఆంక్షలు కొనసాగుతుండగా,కరీబియన్‌ ప్రాంతంలో యుద్ధ నౌకలు,నిఘా విమానాలు,ఇతర సైనిక బలగాల మోహరింపును అమెరికా వేగవంతం చేసింది. ముఖ్యంగా ఈ నెల 20న యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇదిలా ఉండగా,క్యూబా ప్రస్తుతం తీవ్రమైన చమురు కొరతతో సతమతమవుతోంది. ఇంధన లభ్యత తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ కోతలు పెరిగాయి. ప్రజా రవాణా సేవలు అంతరాయానికి గురవుతుండగా, పారిశ్రామిక రంగ కార్యకలాపాలపై కూడా ప్రభావం పడుతోంది.

వివరాలు 

1959లో జరిగిన క్యూబన్‌ విప్లవం అనంతరం ఇరు దేశాల మధ్య విభేదాలు

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న క్యూబా ఆర్థిక వ్యవస్థకు ఈ పరిస్థితులు మరింత భారంగా మారాయి. రష్యా, చైనాలతో క్యూబా కొనసాగిస్తున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల క్యూబాను అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. మరోవైపు, ప్రస్తుత ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్స్‌ హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే వేలాది మంది క్యూబన్లు, అమెరికన్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. 1959లో జరిగిన క్యూబన్‌ విప్లవం అనంతరం అమెరికా-క్యూబా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement