US-Venezuela War: వెనిజులా-యూఎస్ మధ్య ఉద్రిక్తత.. దాడి వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ కారణాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. బుధవారం తెల్లవారుజామున అమెరికా వెనిజులాపై తీవ్ర దాడులు చేపట్టింది. ముఖ్యంగా రాజధాని కారకస్‌ను లక్ష్యంగా చేసుకుని భారీగా బాంబుల వర్షం కురిపించినట్లు సమాచారం. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను నిర్బంధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెనిజులాపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మదురోను వెనిజులా నుంచి అమెరికాకు తరలించినట్లు కూడా ఆయన తెలిపారు.
Details
అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశం
కొన్ని రోజులుగా అమెరికా-వెనిజులా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మదురో ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధమని అమెరికా ఆరోపిస్తోంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడినే అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వలసలు, జాతీయ భద్రత అంశాలను కారణాలుగా చూపుతూ అమెరికా ఈ దాడులకు పాల్పడినట్లు ట్రంప్ తెలిపారు.
Details
వెనిజులాపై అమెరికా ఎందుకు దాడి చేసింది?
వెనిజులా నుంచి భారీ ఎత్తున మాదకద్రవ్యాలు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నాయనే ఆరోపణలను ట్రంప్ ప్రధాన కారణంగా ప్రస్తావించారు. మరోవైపు, వెనిజులా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటుతున్న వారిలో వెనిజులా పౌరులే ఎక్కువగా ఉన్నారని ట్రంప్ ఆరోపించారు. నివేదికల ప్రకారం, 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు ఎనిమిది మిలియన్ల మంది వెనిజులా ప్రజలు ఆర్థిక పతనం, రాజకీయ అణచివేత నుంచి తప్పించుకునేందుకు దేశాన్ని విడిచిపెట్టినట్లు అంచనా. వీరిలో ఎక్కువ మంది లాటిన్ అమెరికాలోని ఇతర దేశాల్లో పునరావాసం పొందినట్లు తెలుస్తోంది.
Details
తీవ్రంగా ఖండించిన వెనిజులా
మదురో కావాలనే తన జైళ్లలోని ఖైదీలను అమెరికాకు వెళ్లమని బలవంతం చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను వెనిజులా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రెండో ప్రధాన కారణంగా డ్రగ్స్‌ను ట్రంప్ ప్రస్తావించారు. వెనిజులా కోకైన్ అక్రమ రవాణాకు ప్రధాన మార్గంగా మారిందని, అమెరికాలో ఫెంటానిల్ సంక్షోభానికి ఇది దోహదపడుతోందని ఆయన వాదించారు. వెనిజులాకు చెందిన నేర సంస్థలు ట్రెన్ డి అరగువా, కార్టెల్ డి లాస్ సోలెస్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా (FTOలు) ప్రకటించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ రెండో సంస్థకు స్వయంగా మదురోనే నాయకత్వం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు
Details
కారకస్‌పై దాడులు, మదురో అరెస్ట్
ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం, వెనిజులాకు వ్యతిరేకంగా అమెరికా చిన్నదైన కానీ అత్యంత తీవ్రత కలిగిన ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా మదురోతో పాటు ఆయన భార్యను నిర్బంధించి దేశం వెలుపలకు తరలించినట్లు తెలిపారు. ఈ అరెస్ట్‌లో యూఎస్ అధికారులు నేరుగా పాల్గొన్నారని చెప్పారు. తమ దళాలు అత్యంత సమర్థంగా పనిచేశాయని యూఎస్ సైన్యాన్ని ట్రంప్ ప్రశంసించారు. మరోవైపు, అమెరికా తమ పౌరులపై, సైనిక స్థావరాలపై దాడులు చేసిందని వెనిజులా ఆరోపించింది. కారకస్‌తో పాటు పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
Details
గత కొన్ని నెలలుగా ఘర్షణ వాతావరణం
గత కొన్ని నెలలుగా అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైనా అమెరికా వెనిజులాపై దాడి చేయవచ్చని పలు నివేదికలు ముందుగానే హెచ్చరించాయి. కరేబియన్ సముద్రంలో USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమాన వాహక నౌకతో పాటు భారీ స్థాయిలో యూఎస్ నావికాదళం, వైమానిక దళాలను మోహరించారు. వెనిజులా చమురుపై ఆంక్షలలో భాగంగా అమెరికా రెండు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఉపయోగించే డాకింగ్ ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్లు ట్రంప్ గతంలోనే వెల్లడించారు. ఇదే వెనిజులాపై అమెరికా చేసిన మొదటి ప్రత్యక్ష దాడిగా పేర్కొంటున్నారు. అయితే, డ్రగ్స్ కార్టెల్‌లతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, అమెరికా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో స్పష్టం చేశారు.