Loading...
US Middle East Security Alert: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. అమెరికా పౌరులకు కీలక భద్రతా హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. అమెరికా పౌరులకు కీలక భద్రతా హెచ్చరిక

US Middle East Security Alert: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. అమెరికా పౌరులకు కీలక భద్రతా హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అనూహ్యంగా పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం నేపథ్యంలో అమెరికా కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖకు చెందిన కాన్సులర్‌ అఫైర్స్‌ విభాగం శనివారం భద్రతా హెచ్చరికను విడుదల చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం భద్రతా పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేమని.. అందువల్ల అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విమాన సర్వీసులు రద్దు కావడం, గగనతలాన్ని మూసివేయడం వంటి పరిణామాలతో పాటు ఇతర ప్రయాణ అంతరాయాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

వివరాలు

హౌతీలు, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు

ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీలు, సౌదీ అరేబియా మధ్య కొనసాగుతున్న శత్రుత్వాన్ని కూడా అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తావించింది.

పౌర విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగిన విషయాన్ని పేర్కొంది. ఈ సైనిక ఘర్షణలు వేగంగా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

మధ్యప్రాచ్యం వెలుపల ఉన్న అమెరికా పౌరులు ఈ ప్రాంతానికి వెళ్లడం లేదా అక్కడి మీదుగా ప్రయాణించడంపై తీవ్రంగా పునరాలోచించాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.

ఇప్పటికే మధ్యప్రాచ్యానికి లేదా అక్కడి నుంచి ప్రయాణించేవారు విమానాశ్రయాలు, విమానయాన సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరింది.

వివరాలు

అమెరికా సంస్థలపై దాడుల ముప్పు

మధ్యప్రాచ్యం వెలుపల ఉన్నవాటితో సహా అమెరికా దౌత్య కార్యాలయాలు, ఇతర దౌత్య సంబంధిత కేంద్రాలు కూడా లక్ష్యంగా మారినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

ఇరాన్‌, ఇరాన్‌కు మద్దతు ఇచ్చే సంస్థలు విదేశాల్లోని ఇతర అమెరికా ప్రయోజనాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

అమెరికా, అమెరికన్లకు సంబంధించిన ప్రాంతాలు, అమెరికా కంపెనీలు, ఇతర సంస్థలపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.

అందువల్ల అమెరికా పౌరులు తమ భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.

మరోవైపు.. శనివారం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని 'సున్నితమైన' ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించారు.

ADVERTISEMENT

వివరాలు

రియాద్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశామన్న హౌతీలు

రియాద్‌ నగరంలోని విమానాశ్రయం సమీపంలో మంటలు, పెద్ద ఎత్తున నల్లటి పొగ కనిపించినట్లు సమాచారం. దీంతో సౌదీ అధికారులు ప్రజలకు వైమానిక దాడి జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు.

రియాద్‌ వైపు దూసుకొచ్చిన ఓ క్షిపణిని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించి అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా సైనిక కూటమి వెల్లడించింది.

అనంతరం అధికారులు ఆల్‌-క్లియర్‌ ప్రకటించారు. రియాద్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారని రాయిటర్స్‌ నివేదించింది.

రియాద్‌ వైపు వచ్చిన క్షిపణిని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు ధ్రువీకరించినట్లు తెలిపింది.

ADVERTISEMENT