Bangladesh: బంగ్లాదేశ్ అతలాకుతలం.. హసీనా తీర్పు ముందు దేశవ్యాప్తంగా అల్లర్లు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో మరోసారి అతలాకుతలమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా కేసుపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ICT) సోమవారం వెలువరించబోయే తీర్పు నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే ఉద్రిక్తతలు చెలరేగాయి. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో హింస చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దసంఖ్యలో ప్రజలు వీధుల్లోకి రావడంతో, కనిపిస్తే కాల్చివేయాలన్న ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మాజీ ప్రధాని హసీనాపై గత ఏడాది విద్యార్థుల నిరసనలను అణగదొక్కిన కేసులో అమానుష చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐసీటీ తీర్పు ఇవ్వబోతోంది. హసీనా, ఆమె ప్రభుత్వ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఖమాల్‌ను నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వారిగా గుర్తించి విచారణ జరిపారు.
వివరాలు
నేను ప్రజల కోసమే పనిచేశాను,అదే చేస్తూ ఉంటాను: హసీనా
ప్రస్తుతం భారత్‌లో ఉన్న హసీనాకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ ట్రిబ్యునల్‌ను కోరింది. అంతలోనే...ఐసీటీ తీర్పు నేపథ్యంలో అవామీ లీగ్ ఫేస్‌బుక్ పేజీలో హసీనా ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. "నాపై దాడులు చేయడం,నాకు కేసులు పెట్టడం ఇవేమీ కొత్తవి కావు. నాకు శిక్ష పడినా మీరెవ్వరూ భయపడవద్దు. వాళ్లు నన్ను ఎలాంటి విచారణకైనా గురిచేస్తే చేసుకోనీండి .ఇది నాకు దేవుడు ఇచ్చిన జీవితం. ఏదో ఒక రోజు మరణం తప్పదు.కానీ నేను ప్రజల కోసమే పనిచేశాను,అదే చేస్తూ ఉంటాను. నన్ను పదవి నుండి తొలగించడానికి ముందే ప్లాన్ చేశారని యూనస్ స్వయంగా ఒప్పుకున్నారు. ఆయనకు అధికారం మీదే మోజు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 7(B) ప్రకారం ఎన్నికైన ప్రభుత్వాన్ని బలవంతంగా తొలగించడం శిక్షార్హం.
వివరాలు
అవామీ లీగ్ నవంబర్ 17న దేశవ్యాప్తంగా బంద్
యూనస్ అదే చేశారు.నాపై పెట్టినవి పూర్తిగా తప్పుడు కేసులే. కోర్టులో తప్పుడు ఫిర్యాదు చేస్తే శిక్ష పడుతుంది. ఒక రోజు అది జరుగుతుందనే నమ్మకం ఉంది. నేను బతికి ఉన్నాను... బతుకుతాను. ప్రజల పక్షాన నిలుస్తూనే ఉంటాను. యూనస్ ప్రభుత్వం దేశాన్ని మిలిటెంట్‌ల రాజ్యంగా మారుస్తోంది. బంగ్లాదేశ్ ప్రజలు భద్రత కోల్పోయారు." ఇదే నేపథ్యంలో అవామీ లీగ్ నవంబర్ 17న దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించింది. హసీన వీడియో బయటకు వచ్చిన తర్వాత... బంగ్లాదేశ్‌లో పలుచోట్ల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వాహనాలకు నిప్పంటించారు. జాతీయ రహదారులపై చెట్లను కూలదోసి రాకపోకలు నిలిపేశారు. భారీగా ర్యాలీలు నిర్వహించారు. ప్రతిస్పందనగా యూనస్ ప్రభుత్వం సైన్యం,పోలీసులు,బోర్డర్ గార్డులను రంగంలోకి దించింది.
వివరాలు
మా అమ్మకు మరణశిక్ష విధిస్తారేమో: హసీనా కుమారుడు
ప్రాణహాని కలిగించే నిరసనలు చేస్తే కాల్పులకు వెనుకాడవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ICT కోర్ట్ చుట్టూ భద్రతను మరింత కఠినతరం చేశారు. ఇదిలా ఉండగా.. తీర్పు నేపథ్యంలో షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ స్పందిస్తూ.. "మా అమ్మకు మరణశిక్ష పడే అవకాశమే ఎక్కువ. తీర్పు మాకు తెలిసిందే.. యూనస్ ప్రభుత్వం ఆమెను నేరస్థురాలిగా ప్రకటించబోతోంది. కానీ వాళ్లు ఆమెకు ఏం చేయగలరు? ఆమె భారత్‌లో పూర్తిగా భద్రతలో ఉంది. భారత్ ఆమెను పూర్తిగా రక్షిస్తోంది." అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయకపోతే వచ్చే ఏడాది ఎన్నికలను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు.
వివరాలు
తీర్పు ప్రత్యక్ష ప్రసారం..
ప్రాసిక్యూటర్లు తెలిపిన ప్రకారం, తీర్పులోని కొన్ని భాగాలను ప్రభుత్వ ఆధీనంలోని బీటీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే ICT-BD అధికారిక ఫేస్‌బుక్ పేజీ లో ప్రసారం ఉంటుంది. హసీనాను అరెస్టు చేయకపోతే లేదా 30 రోజుల్లో స్వయంగా లొంగిపోకపోతే ఆమె అప్పీల్ హక్కు చట్టం ప్రకారం రద్దవుతుందని వెల్లడించారు. ఏ తీర్పు వచ్చినా అమలు చేస్తామని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు జహంగీర్ అలం చౌదరి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్‌లోనే ఉన్నాయి.