Qatar: దోహా తీరంలో ఉద్రిక్తత.. ఖతార్ సమీపంలో నౌకపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య మరో కీలక ఘటన చోటుచేసుకుంది. ఖతార్ రాజధాని దోహా సమీపంలో భారీ కంటైనర్లను తరలిస్తున్న ఓ బల్క్ క్యారియర్ నౌకపై గుర్తుతెలియని డ్రోన్ లేదా క్షిపణితో దాడి జరిగినట్లు బ్రిటిష్ మిలిటరీ వెల్లడించింది. ఈ దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగినప్పటికీ, సిబ్బంది అప్రమత్తంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. యూకే సముద్ర వాణిజ్య కార్యకలాపాలు (UKMTO) తెలిపిన వివరాల ప్రకారం, దోహాకు సుమారు 23 నాటికల్ మైళ్ల దూరంలో ఓ నౌక సరకు రవాణా చేస్తుండగా గుర్తుతెలియని ఆయుధం నౌకను తాకింది.
వివరాలు
ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు
దీంతో నౌకలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే సిబ్బంది వెంటనే చర్యలు తీసుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమలులో ఉన్న సమయంలోనే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఘటన అనంతరం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. దాడికి గురైన నౌక ఏ దేశానికి చెందినది, అందులో ఎలాంటి సరకు తరలిస్తున్నారన్న వివరాలు మాత్రం ఇప్పటివరకు వెల్లడికాలేదు.