LOADING...
Pakistan: క్వెట్టాలో ఉగ్రవాద దాడి.. 10 మంది మృతి, 32 మందికి గాయాలు
క్వెట్టాలో ఉగ్రవాద దాడి.. 10 మంది మృతి, 32 మందికి గాయాలు

Pakistan: క్వెట్టాలో ఉగ్రవాద దాడి.. 10 మంది మృతి, 32 మందికి గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో మంగళవారం ఘోర ఘటన చోటుచేసుకుంది. తూర్పు క్వెట్టాలోని ఫ్రాంటియర్ కార్ప్స్ ఆర్మీ ప్రధాన కార్యాలయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. వెంటనే అక్కడే తుపాకీ కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాకిస్థాన్ ప్రముఖ మీడియా వెబ్‌సైట్ డాన్ ప్రకారం, ఈ ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 32 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పేర్కొంది. బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ సహా రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Details

ఘటనా స్థలంలో కాల్పుల శబ్దాలు

గాయపడిన వారిని, మృతదేహాలను క్వెట్టా సివిల్ హాస్పిటల్, బిఎంసి హాస్పిటల్, ట్రామా సెంటర్లకు తరలించినట్లు రెస్క్యూ అధికారులు నిర్ధారించారు. ఈ పేలుడు నగరంలో భయాందోళనలు రేకెత్తించగా, సంఘటనా స్థలంలో కాల్పుల శబ్దాలు నిరంతరం వినిపించాయి. వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పేలుడు సమయంలో ఎగిసిపడిన మంటలు, శబ్దాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఘటనకు గల కారణాలు వెలికితీయడానికి పోలీసు దర్యాప్తు ప్రారంభమైంది. ఇప్పటికే రెస్క్యూ బృందాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. క్వెట్టా ప్రాంతం పాకిస్తాన్‌లో తీవ్రవాద హింసకు ప్రధాన కేంద్రం. లష్కరే ఝాంగ్వీ(LeJ), ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్(ISKP)ఆధ్వర్యంలోని వేర్పాటువాద, ఉగ్రవాద ఘటనలు తరచుగా చోటు చేసుకుంటూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.