Moscow : మాస్కో లో ఉగ్రదాడి..60 మంది మృతి,145కిపైగా గాయాలు..బాధ్యత వహించిన ఇస్లామిక్ స్టేట్
రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది.ఓ షాప్పింగ్ మాల్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. కాన్సర్ట్ హాల్‌లో ఆర్మీ యూనిఫాం ధరించిన వ్యక్తుల బృందం కాల్పులు జరపడంతో 60 మందికి పైగా మరణించారు. 145 మందికి పైగా గాయపడ్డారు. రష్యా వార్తా నివేదికల ప్రకారం, ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను విసిరారు. మాస్కో పశ్చిమ అంచున ఉన్న క్రోకస్ సిటీ హాల్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాల్పుల అనంతరం మాల్‌లో గందరగోళం నెలకొంది. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. రాయిటర్స్ ప్రకారం, ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించిందని గ్రూప్ టెలిగ్రామ్ ఛానెల్ తెలిపింది.
కచేరీ హాలులో పేలుడు
తీవ్రవాద చర్యగా అధికారులు దర్యాప్తు చేస్తున్నఈ దాడి ఇటీవలి సంవత్సరాలలో రష్యాలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి అని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. మార్చి17న కొత్త ఆరేళ్ల పదవీకాలానికి తిరిగి ఎన్నికైన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అతని సహాయకులు దాడి గురించి వివరించారు. దాడి,సంఘటన స్థలంలో ప్రస్తుత పరిస్థితి గురించి పుతిన్ ఎప్పటికప్పుడు అప్డేట్లు అందుకుంటున్నారని క్రెమ్లిన్ తెలిపింది. పలువురు ఉగ్రవాదులు కచేరీ హాలులోకి చొరబడి సందర్శకులపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారని రష్యా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను ఉపయోగించడం వల్ల క్రోకస్ సిటీ హాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో భవనంపై పెద్ద ఎత్తున నల్లటి పొగ ఎగసిపడుతున్నట్లు చూడొచ్చు.
ఉగ్రవాదులను అంతమొందించేందుకు ప్రత్యేక దళాలు
6,000 మందికి పైగా వసతి కల్పించే హాల్‌లో ప్రఖ్యాత రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ కచేరీ కోసం భారీ సంఖ్యలో గుమిగూడిన సమయంలో ఈ దాడి జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. భవనం లోపల ఉన్న ఉగ్రవాదులను అంతమొందించేందుకు ప్రత్యేక దళాలు భవనం వద్దకు చేరుకున్నాయని రష్యా మీడియా పేర్కొంది. రష్యన్ మీడియా ప్రకారం, 70 అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మాస్కోపై దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
మాస్కో దాడిపై స్పందించిన అమెరికా
ఈ దాడిపై వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జాన్ కిర్బీ స్పందిస్తూ.. ఈ దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మాస్కోపై 48 గంటల్లో పెద్ద దాడి జరగబోతోందని దాదాపు 15 రోజుల క్రితం అమెరికా రష్యాను హెచ్చరించిందన్నారు. కానీ ఆ సమయంలో దాడి జరగలేదు. కానీ 15 రోజుల తరువాత మాస్కోలో జరిగిన ఈ దాడిని అమెరికా చేసిన ఆ ప్రకటనకు లింక్ చేసి ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు.