Loading...
US-Iran Peace Deal: ఇరాన్‌తో అమెరికా శాంతి ఒప్పందం ముగిసినా వీడని యుద్ధ ప్రతిష్ఠంభన
ఇరాన్‌తో అమెరికా శాంతి ఒప్పందం ముగిసినా వీడని యుద్ధ ప్రతిష్ఠంభన

US-Iran Peace Deal: ఇరాన్‌తో అమెరికా శాంతి ఒప్పందం ముగిసినా వీడని యుద్ధ ప్రతిష్ఠంభన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడంతోపాటు ఆ దేశ అణు కార్యక్రమ వివాదానికి తెరదించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత జూన్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం గడువు సోమవారంతో ముగిసింది. అయితే ఇరుదేశాల మధ్య శాశ్వత శాంతికి మార్గం చూపేలా ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు. దాదాపు 60 రోజుల క్రితం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పటికీ అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. మధ్యంతర శాంతి ఒప్పందంలో భాగంగా హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించాల్సి ఉంది. కానీ ఈ అంశంపై అమెరికా, ఇరాన్‌ మధ్య ఇప్పటివరకు ఎలాంటి రాజీ కుదరలేదు. దీంతో ఈ దశలో యుద్ధం నుంచి వెనక్కి తగ్గేందుకు అమెరికాకు స్పష్టమైన, సహేతుకమైన కారణం కనిపించడం లేదు.

వివరాలు 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం

మరోవైపు ఇరాన్‌ చేస్తున్న డిమాండ్లకు అమెరికా అంగీకరిస్తే.. ప్రపంచంలో దాదాపు ఐదో వంతు చమురు రవాణా జరిగే హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌కు మరింత ఆధిపత్యం ఇచ్చినట్లవుతుంది.

అది అమెరికా తన ఓటమిని అంగీకరించినట్లుగా భావించే అవకాశం ఉంది.

అదే సమయంలో యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికా వద్ద ఉన్న క్షిపణి విధ్వంసక వ్యవస్థల నిల్వలు క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.

యుద్ధం మరింత కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం పెరగడంతోపాటు అమెరికాలోనూ ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

అమెరికా పార్లమెంటుకు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇంధన ధరలు పెరగడం ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

వివరాలు 

ఏ ఒక్క నిబంధనా అమలు కాలేదు

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్‌ రెండూ తమ వైఖరిపై బెట్టు వీడకుండా ఉన్నాయి.

గత జూన్‌లో అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం 60 రోజులపాటు సైనిక చర్యలను నిలిపివేయాల్సి ఉంది.

ఇరాన్‌ అణు కార్యక్రమంపై చాలా కాలంగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలకాలని కూడా ఒప్పందంలో పేర్కొన్నారు.

అలాగే హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించాల్సి ఉంది.

అయితే ఈ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రించే బాధ్యతను ఇరాన్‌కు అప్పగించడం వివాదానికి కారణమైంది.

ఆ బాధ్యతపై ఒప్పందంలో స్పష్టత లేకపోవడం వల్ల హర్మూజ్‌పై తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ఇరాన్‌కు అవకాశం లభించినట్లయింది.

ADVERTISEMENT

వివరాలు 

ఏ ఒక్క నిబంధనా అమలు కాలేదు

అవగాహన ఒప్పందం కుదిరిన వారం రోజులు కూడా పూర్తికాకముందే అమెరికా నియంత్రణలో ఉన్న ఒమన్‌ తీరం వెంబడి ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్‌ కాల్పులు ప్రారంభించింది.

దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించి ఇరాన్‌పై దాడులను మరింత ఉద్ధృతం చేసింది.

దీంతో ఇరాన్‌ కూడా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న జోర్డాన్, కువైట్, బహ్రెయిన్‌ వంటి అరబ్‌ దేశాలపై దాడులకు పాల్పడింది.

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు విక్రయించుకునేందుకు ఇరాన్‌కు గతంలో ఇచ్చిన అనుమతిని అమెరికా వెనక్కి తీసుకుంది.

అంతేకాకుండా ఇరాన్‌ రేవులపై విధించిన దిగ్బంధనాన్ని కూడా తిరిగి అమలు చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ఏ ఒక్క నిబంధనా అమలు కాలేదు

ఈ పరిణామాల మధ్య జూన్‌లో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించింది తాము కాదంటే తాము కాదంటూ అమెరికా, ఇరాన్‌ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

అయితే వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే.. ఒప్పందంలో పేర్కొన్న ఏ ఒక్క నిబంధన కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదన్నది మాత్రం స్పష్టమవుతోంది.

అమెరికాతో చర్చలను జూన్‌లోనే నిలిపివేసినట్లు ఇరాన్‌ అధికారులు ప్రకటించారు.

అయితే మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి తమకు సందేశాలు ఇప్పటికీ అందుతున్నాయని వారు చెబుతున్నారు.

మరోవైపు ఇరాన్‌తో చర్చలు అడపాదడపా కొనసాగుతూనే ఉన్నాయని ట్రంప్‌ వెల్లడిస్తున్నారు.

పెద్దస్థాయి దాడులను నిలిపివేసిన తర్వాత ఇరాన్‌తో జరుపుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపించిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

గడువు పొడిగిస్తారా?

అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం సోమవారంతో ముగిసినప్పటికీ.. దాని గడువును పొడిగించే అవకాశం ఉందని చర్చల్లో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అయితే హర్మూజ్‌ జలసంధి, ఇరాన్‌ అణు కార్యక్రమం, చమురు రవాణా, యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం వంటి కీలక అంశాలపై ఇరుపక్షాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT