Spain: స్పెయిన్‌కు వెళ్తున్న బోటు బోల్తా.. 69మంది దుర్మరణం
స్పెయిన్‌కు వెళ్ళే బోటు బోల్తా పడటంతో 69 మంది మరణించినట్లు మాలి అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఈ నెల 19న చోటుచేసుకుంది. ఆ సమయంలో బోటులో 80 మంది ప్రయాణిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్‌లోని కేనరీ దీవులకు వెళ్ళేందుకు బయలుదేరిన ఈ బోటుకు జరిగిన ప్రమాదంలో కేవలం 11 మంది మాత్రమే బతికి బయటపడ్డారని మాలి విదేశాంగ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సంఘటనపై పరిస్థితులను పర్యవేక్షించేందుకు సంక్షోభ నివారణ బృందాన్ని నియమించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.
25 మంది మాలి జాతీయులుగా గుర్తింపు
మరణించిన వారిలో 25 మంది మాలి జాతీయులుగా గుర్తించారు. వారంతా మారిటానియాలో నిర్మాణ రంగ పరిశ్రమలో పని చేయడానికి ఆరు నెలల క్రితం అక్కడ వెళ్లినట్లు మారెనా నగర మేయర్ తెలిపారు. ఈ ప్రయాణం కోసం వారిని సాహసంతో ప్రోత్సహించిన వారి స్నేహితులు యూరప్, అమెరికాకు వెళ్లాలని వారికి చెప్పారని తెలిపారు. కొంతమంది అయితే తమ కుటుంబ సభ్యులతో చెప్పకుండా ఈ ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు మేయర్ పేర్కొన్నారు.