Strait of Hormuz: యుద్ధం ప్రభావం శాశ్వతమే.. హర్మూజ్‌పై ఘాలిబఫ్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, హర్మూజ్ జలసంధి అంశంపై అమెరికా, ఇరాన్ మధ్య వ్యాఖ్యల యుద్ధం కొనసాగుతోంది. ఈ కీలక జలమార్గం నిర్వహణ పూర్తిగా ఇరాన్ ఆధీనంలోనే ఉందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘాలిబఫ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా హర్మూజ్ జలసంధి యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులకు ఇకపై ఎప్పటికీ తిరిగి వెళ్లదని వ్యాఖ్యానించారు. అమెరికాపై తమ దేశానికి ఉన్న అవిశ్వాసాన్ని కూడా ఘాలిబఫ్ బహిరంగంగా వ్యక్తం చేశారు. "మేము అమెరికన్లను ఎప్పుడూ నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మడం లేదు. భవిష్యత్తులో కూడా అదే వైఖరిని కొనసాగించడం సమంజసమేనని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఇప్పటికే పలు దఫాల చర్చలు
ఇరాన్, అమెరికా మధ్య స్విట్జర్లాండ్‌లో ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రీజ్ చేసిన 12 బిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ ఆస్తుల విడుదలకు సంబంధించి తుది ఒప్పందం కుదిరినట్లు ఘాలిబఫ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఇరాన్ అమెరికా నుంచి సోయాబీన్, మొక్కజొన్న, గోధుమలను కొనుగోలు చేసేందుకు అంగీకరిస్తే, ఫ్రీజ్ చేసిన ఆ దేశ ఆస్తులను విడుదల చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఇటీవల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.