Page Loader
Strait of Hormuz: ఇరాన్‌ చేతికి చిక్కిన చమురు నాడి.. హర్మూజ్‌ బంద్ అయితే ప్రపంచం అస్తవ్యస్తం!
ఇరాన్‌ చేతికి చిక్కిన చమురు నాడి.. హర్మూజ్‌ బంద్ అయితే ప్రపంచం అస్తవ్యస్తం!

Strait of Hormuz: ఇరాన్‌ చేతికి చిక్కిన చమురు నాడి.. హర్మూజ్‌ బంద్ అయితే ప్రపంచం అస్తవ్యస్తం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ యుద్ధం ఇతర గల్ఫ్‌ దేశాలకూ వ్యాపిస్తే, అంతర్జాతీయ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధి మూతపడే అవకాశముంది. ఈ జలసంధి నుంచి ప్రపంచం వాడే చమురులో సుమారు 20 శాతం రవాణా అవుతోంది. అటువంటి ప్రదేశంలో ఒక్క ఇంచు మార్పు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది.

Details

అత్యంత ఇరుకైన జలసంధి

హర్మూజ్‌ జలసంధి అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం, ఇరాన్‌ మధ్య ఉన్న సముద్ర మార్గం. ఈ మార్గంలో ఒక ప్రదేశం కేవలం 33 కిలోమీటర్ల వెడల్పే ఉంది. ఈ మార్గంలో రెండు షిప్పింగ్‌ లైన్లు ఉండగా, వెరీ లార్జ్‌ క్రూడ్‌ క్యారియర్లు (VLCCs) సులువుగా ప్రయాణించగలవు. ఒమాన్‌ తీరం నుంచి నౌకలు పర్షియన్‌ గల్ఫ్‌ వైపు వెళ్లి, చమురుతో నిండి తిరిగి హర్మూజ్‌ ద్వారా బయటకు వస్తాయి.

Details

చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణాకు జీవనాడి

హర్మూజ్‌ మార్గం ద్వారా రోజూ సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ఇది ప్రపంచ వినియోగంలో సుమారు ఐదో వంతు. ఇక్కడి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ దేశాల నుంచి చమురు ఎగుమతి అవుతోంది. అంతేకాదు, గ్యాస్ రంగంలోనూ ఇది కీలకం. ప్రపంచ ఎల్‌ఎన్‌జీ రవాణాలో మూడింట ఒక వంతు హర్మూజ్‌ ద్వారానే జరుగుతుంది. ఖతార్‌ ఇక్కడి నుంచి అధికంగా ఎగుమతి చేస్తోంది. ఈ కారణంగా అమెరికా బహ్రేన్‌లో తన ఫిఫ్త్‌ ఫ్లీట్‌ను స్థాపించింది.

Details

భారత్‌పై దీని ప్రభావం ఎంత?

భారత్‌ తన చమురు అవసరాల్లో 40 శాతం ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటోంది. ఇరాక్‌, సౌదీ, యూఏఈ, కువైట్‌, ఖతార్‌ వంటి దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేస్తోంది. మన దేశం వినియోగించే చమురులో 90 శాతం విదేశీ మార్కెట్లనుంచి దిగుమతి అవుతోంది. ఈజలసంధి మూసుకుపోతే రవాణా, బీమా ఖర్చులు పెరిగి, పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌ఎన్‌జీ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 13న కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి మాట్లాడుతూ, భారత్‌ అవసరాలకు సరిపడా చమురు సరఫరా ఉంటుందని తెలిపారు. దేశానికి ఇప్పటికే వ్యూహాత్మక నిల్వలు 74 రోజులకు సరిపడినంతగా ఉన్నాయని చెప్పారు.

Details

హర్మూజ్‌ జలసంధిలో గత ఉద్రిక్తతలు

ఇరాన్‌ ఈ జలసంధిని ఎప్పుడూ మూసలేదు. తాము ఉత్పత్తి చేసే చమురులో 80శాతం చైనా కొనుగోలు చేస్తుండటమే దీనికికారణం. 1973లో ఈజిప్ట్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం సమయంలో సౌదీఅరేబియా చమురు సరఫరాను నిలిపినప్పటికీ, ఇప్పటి పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు. అమెరికా స్వయంగా చమురు ఎగుమతిదారుగా మారింది. 1980-88 మధ్య ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధంలో ఇరు దేశాలు ట్యాంకర్లపై దాడులు జరిపాయి. దీనిని "ట్యాంకర్‌ వార్‌"గా పిలుస్తారు. దాదాపు 450 నౌకలపై దాడులు జరిగాయి. 1988లో అమెరికా ఓ ఇరాన్‌ పౌర విమానాన్ని పొరబాటున కూల్చడంతో 290 మంది మరణించారు. ఇరాన్‌ ఉద్దేశపూర్వకంగా కూల్చిందని ఆరోపించగా, అమెరికా అది పొరబాటేనని తెలిపింది. ఇటీవల కాలంలో అమెరికా, ఐరోపా విధించిన ఆంక్షలకు ప్రతిగా హర్మూజ్‌ జలసంధిని మూసేస్తామంటూ ఇరాన్‌ హెచ్చరించింది.