South Korea plane crash: ల్యాండింగ్ గేర్ సమస్యతో విమానం పేలుడు
దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి ల్యాండింగ్ గేర్ వైఫల్యమే కారణమని తెలిసింది. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్ ఫ్లైట్ 7C2216 (బోయింగ్ 737-800 శ్రేణి) ల్యాండింగ్ ప్రయత్నంలో అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విమానం ల్యాండింగ్‌కు యత్నించినప్పటికీ విఫలమై, మళ్లీ నేలపైకి దిగినప్పుడు రన్‌వే చివరకు చేరిన తర్వాత వేగాన్ని నియంత్రించలేక గోడను ఢీకొట్టింది. దీంతో ఇంధనం చెలరేగి మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ల్యాండింగ్ సమయంలో గేర్, టైర్లు పనిచేయకపోవడం ప్రమాదానికి దారి తీసింది.
భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
పక్షి ఢీకొనడం వల్ల గేర్ వ్యవస్థకు నష్టం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 62 మంది మృతి చెందినట్లు యాంహాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మృతుల్లో 37 మంది మహిళలు ఉన్నట్లు ఎస్‌జే ఫైర్ సర్వీస్ వెల్లడించింది. విమానం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధృవీకరించారు. తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ ఈ ఘటనపై స్పందించి, తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటీరియర్, ల్యాండ్ మినిస్టర్లతో పాటు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.