Donald Trump: ఈ-మెయిళ్లు హ్యాకయ్యాయి.. ఇదంతా ఇరానే పనే : ట్రంప్ ప్రచార బృందం
అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఇరాన్ యత్నిస్తోందని గతంలో మైక్రోసాఫ్ట్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం లీక్ అయ్యేలోపే ట్రంప్ ప్రచార బృందం తమ ఈ-మెయిళ్లు హ్యాకయ్యాయని ఆరోపణలు చేయడం గమనార్హం. ఇది ఇరాన్ మద్దతు ఉన్న బృందాల పనేనని ట్రంప్ ప్రచారం బృందం ఆరోపణలు చేసింది. మరోవైపు కీలక అంతర్గత సమాచారాన్ని తస్కరించి బహిర్గతం చేస్తున్నాయని స్పష్టం చేసింది. దీని వెనుక ఇరాన్ ప్రభుత్వ హస్తం ఉందని కచ్చితమైన ఆధారాలను వెల్లడించలేదు.
అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదు : ఇరాన్
ట్రంప్ వర్గాల ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఏ మాత్రం సహంచబోమని పేర్కొంది. తమ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపర్చేందుకు ఎలాంటి కార్యకలాపాలనైనా సహించేది లేదని హెచ్చరించింది. మరోవైపు ఐరాస్‌లో ఇరాన్ రాయబార అధికారులు కూడా ట్రంప్ వర్గాల ఆరోపణలు ఖండించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని వివరణ ఇచ్చింది.