Page Loader
USA:అంతర్యుద్ధాలతో తల్లడిల్లుతున్న 11 దేశాలకు అమెరికా ఝలక్‌ - డబ్ల్యూఎఫ్‌పీ సాయం నిలిపివేత
అంతర్యుద్ధాలతో తల్లడిల్లుతున్న 11 దేశాలకు అమెరికా ఝలక్‌

USA:అంతర్యుద్ధాలతో తల్లడిల్లుతున్న 11 దేశాలకు అమెరికా ఝలక్‌ - డబ్ల్యూఎఫ్‌పీ సాయం నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్యుద్ధాల వల్ల తీవ్రంగా బాధపడుతున్న దేశాల్లో లక్షలాది మంది ప్రజలకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అందిస్తున్న ప్రపంచ ఆహార పథకం (WFP) ద్వారా జరిగే ఆహార సహాయాన్ని అమెరికా ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అఫ్గానిస్థాన్, సిరియా, యెమెన్‌ సహా మొత్తం 11 దేశాల ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడింది. "అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రాజెక్టును ఆపివేస్తున్నాం. డోజ్‌లోని USAID సంస్థకు చెందిన వ్యవహారాలను పర్యవేక్షించే జెరెమీ లూవిన్‌ ఈ నిర్ణయాన్ని అందించారు" అని సంబంధిత భాగస్వాములకు పంపిన అధికార నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయం నేపథ్యంలో గత వారం రోజుల్లోనే వివిధ శాఖలకు 60కిపైగా లేఖలు పంపించినట్లు సమాచారం.

వివరాలు 

ట్రంప్‌ పరిపాలనా యంత్రాంగంతో చర్చలు

ఈ పరిణామంపై ప్రపంచంలో అతిపెద్ద ఆహార సహాయ సంస్థ అయిన డబ్ల్యూఎఫ్‌పీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "ఈ చర్య లక్షలాది మందికి మరణ శిక్ష వంటిది. వారు తీవ్ర ఆకలితో అల్లాడిపోతారు. ఆకలిచావులు జరగటం అనివార్యం" అని డబ్ల్యూఎఫ్‌పీ తన X పేజీలో పేర్కొంది. ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను రక్షించే ఈ సహాయ పథకాల విషయంలో ట్రంప్‌ పరిపాలనా యంత్రాంగంతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది.

వివరాలు 

అత్యవసర సహాయానికి మాత్రం మినహాయింపు 

ఇప్పటి వరకు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఏవైనా కోతలు చేసినా, ప్రాణాధారమైన అత్యవసర సహాయానికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో పాటు పలువురు అధికారులు ఇదివరకే ఇదే విషయాన్ని హామీ ఇచ్చినా, సోమవారం ఆయన కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.