Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది 'హత్యకు కుట్ర!'.. భగ్నం చేసిన అమెరికా
అమెరికాలో సిక్కు వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ హత్యకు కుట్ర జరిగింది. ఈ హత్యాయత్నాన్నిఅమెరికా భగ్నం చెయ్యడమే కాకుండా భారత్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ హత్యాయత్నాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.ఈ విషయమై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు తమ పాలసీలో భాగం కాదని స్పష్టం చేసింది. సిక్కుల వేర్పాటు నేత గుర్ పత్వంత్ సింగ్ హత్యకు పన్నిన కుట్రను అమెరికా తాజాగా భగ్నం చేసిందని పేరు చెప్పని అధికారులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. పన్నున్ హత్యకు రచించిన ప్రణాళికలో భారత్ పాత్ర కూడా ఉండొచ్చన్న అమెరికా ప్రభుత్వం భారతదేశానికి హెచ్చరిక కూడా జారీ చేసిందని కూడా ఈ కథనం పేర్కొంది.
కెనడా-భారత్ మధ్య దిగజారిన సంబంధాలు
ఈ విషయంపై స్పందించడానికి భారత విదేశాంగ శాఖ నిరాకరించిందని తెలిపింది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నేతృత్వం వహిస్తున్న సిఖ్స్ ఫర్ జస్టిస్ ను భారత్ ఉగ్రవాద సంస్ధగా ప్రకటించింది. కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ కుట్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో పార్లమెంట్ వేదికగా సంచలన ఆరోపణలు చేశాక ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినగా.. రెండు రోజుల క్రితం భారత్ కెనడా పౌరులకు ఈ-వీసా సేవలను తిరిగి ప్రారంభించింది.